Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.50 లక్షల వరకు అప్పు
న్యూఢిల్లీ : చిన్న వ్యాపారులకు ఆర్థిక మద్దతును అందించనున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ప్రకటించింది. స్మాల్ బిజినెస్ లోన్ పథకంలో భాగంగా భారత్కు 4 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.30 కోట్లు) కేటాయించింది. ఈ మొత్తంతో దేశంలో ఉన్న 200 పట్టణాల్లోని చిరు, మధ్యతరహా వ్యాపారులకు రుణాలు ఇవ్వనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. కనిష్టంగా రూ. 5 లక్షల నుంచి గరిష్టంగా రూ.50 లక్షల వరకు అప్పు ఇవ్వనున్నట్లు తెలిపింది. తొలివిడతగా ఆగస్టు 20వ తేది నుంచి ఈ పథకాన్ని హైదరాబాద్, న్యూఢిల్లీ, గురుగ్రామ్, ముంబయి, బెంగళూరులలో అమలు చేయనున్నట్లు వెల్లడించింది. కనీసం మూడు వేల మందికి రుణాలు అయినా రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. భారత్లోని 200 నగరాల్లో ఈ ప్రోగ్రామ్ను ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. దీని కోసం ఫేస్బుక్ ఇండిఫైతో భాగస్వామ్యం కుదర్చుకుంది. ఈ రుణాలపై 17-20 శాతం మేర వడ్డీ రేటును వసూలు చేయనుంది. మహిళలకు మరో 0.2 శాతం రాయితీ కల్పిస్తోన్నట్లు పేర్కొంది. దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ) రుణ అంతరాలు లేకుండా చేయడం కోసం, చిన్న వ్యాపారులకు వ్యాపార రుణాలను సులభతరం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఫేస్బుక్ ఇండియా ఎండి, ఉపాధ్యక్షుడు అజిత్ మోహన్ తెలిపారు. దీంతో తమ సంస్థకు లబ్ధి చేకూరనుందన్నారు.