Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ పారిశ్రామిక రంగం రుణాల్లో ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మల్లా ఉన్న ఎంఎస్ఎంఈల వాటా పెరిగింది. మొత్తం రుణాల్లో అహారేతర పారిశ్రామిక వర్గం అప్పులు 29.4 శాతంగా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) మద్దతుతో 2021 జులైలో పరిశ్రమల విభాగం రుణాల్లో ఒక్క శాతం పెరుగుదల చోటు చేసుకుంది. ఈ మాసంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమల వాటా 21.3 శాతానికి చేరింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2.14 లక్షల కోట్ల రుణ మద్దతు స్కీమ్ ఈ రంగానికి కలిసి వచ్చిందని భావిస్తున్నారు. మరోవైపు బడా పరిశ్రమల రుణాల జారీ 11 మాసాల కనిష్టానికి పడిపోయింది. పరిశ్రమ మొత్తం రుణాల్లో ఈ వర్గం వాటా 80.5 శాతంగా చోటు చేసుకుంది. గడిచిన జులైలో పెద్ద పారిశ్రామిక వర్గాలకు ఇచ్చే అప్పుల్లో 2.9 శాతం తగ్గుదల ఉండగా.. గతేడాది ఇదే మాసంలో 1.4 శాతం పెరుగుదల నమోదయ్యింది.
అప్పుల మంజూరులో రుణదాతలు పరిమితులు విధించుకోవడంతో కార్పొరేట్లకు ఇచ్చే వాటిలో తగ్గుదల చోటుచేసుకుంది. ముఖ్యంగా ఇటీవల అనేక కార్పొరేట్ కంపెనీలు దివాళా తీయడం, అప్పులు ఎగ్గొట్టడం పెరగడంతో బ్యాంకింగ్ వర్గాలు ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యతనిచ్చాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పెట్టుబడుల వాతావరణం ప్రోత్సాహాకరంగా లేకపోవడం ఈ రంగానికిచ్చే రుణాలు తగ్గేలా చేశాయి. మొత్తం 19 పరిశ్రమల్లో ఆరు రంగాలకు ఇచ్చే రుణాలు డీలా పడ్డాయి. పెట్రోలియం, రబ్బర్, ప్లాస్టిక్, న్యూక్లియర్, ఇంధనం రంగాలు రుణ మద్దతును అందుకున్నాయి. మౌలిక వసతుల రంగంలో విమానాశ్రయాలు, రోడ్లకు ఇచ్చే అప్పుల్లో వరుసగా 58.4 శాతం, 29.7 శాతం వృద్థి నమోదయ్యింది. భవిష్యత్తు సంవత్సరాల్లో పరిశ్రమ రంగం రుణాల వృద్థిలో కీలక పాత్ర పోశించనుందని నిపుణులు భావిస్తున్నారు.