Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి ముగ్గురిలో ఒకరి వ్యక్తిగత వివరాలన్నీ డిజిటల్‌గానే స్టోర్..
- వ్యక్తిగత సమాచార చోరీ ప్రమాదమే ఎక్కువ : లోకల్ సర్కిల్స్ సర్వే
న్యూఢిల్లీ: ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు తమ బ్యాంకు ఖాతా, డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలు, ఏటిఎం పిఎన్లు, ఆధార్ కార్డు, పాన్‌కార్డు వివరాలు వంటి గోప్యమైన వ్యక్తిగత సమాచారాన్ని తమ మొబైల్, కంప్యూటర్ లేదా ఈ-మెయిల్ లో స్టోర్ (నిల్వ) చేసుకుంటున్నారని తాజాగా నిర్వహించిన ఓ సర్వే ద్వారా వెల్లడైంది. దీంతో వ్యక్తిగత సమాచారం చోరికి గురయ్యే ప్రమాదం అధికంగా ఉందని సోషల్ కమ్యూనిటీ ఫ్లాట్‌ఫామ్ 'లోకల్ సర్కిల్స్' సర్వే తెలిపింది. ఈ సర్వే వివరాల ప్రకారం.. 11శాతం మంది భారతీయులు తమ వ్యక్తిగత ఆర్థిక వివరాలను తమ ఫోన్ కాంటాక్ట్ జాబితాలో కూడా సేవ్ చేసుకుంటున్నారు. అయితే, చాలా యాప్‌లు ఇప్పుడు కాంటాక్ట్ వివరాల యాక్సెస్ కోసం అడుగుతున్నాయి.
దీనివల్ల వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని సర్వే వెల్లడించింది. అలాగే, ప్రతి ముగ్గురిలో ఒకరు తమ వ్యక్తిగత పాస్‌వర్డులను కుటుంబంలోని లేదా సన్నిహితంగా ఉండే ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందితో పంచుకుంటున్నారని లోకల్ సర్కిల్ సర్వే పేర్కొంది. కాగా, వ్యక్తిగత ఆర్థిక భద్రత విషయంలో వినియోగదారుల ఆందోళనపై సర్వే నిర్వహించిన పెర్ యునిసిస్ సెక్యూరిటీ ఇండెక్స్-2020 నివేదిక ప్రకారం వ్యక్తిగత క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను అనధికారిక ప్రాప్యత ద్వారా చోరికి గురై మోసాలు జరుగుతున్న ఆందోళనకర విషయాల్లో ఇది ఒకటిగా పేర్కొంది.
తాజా సర్వేను లోకల్ సర్కిల్స్ దేశంలోని 393 జిల్లాల్లోని ప్రజల నుంచి 24,000కు పైగా స్పందనల ఆధారంగా నివేదికను విడుదల చేసింది. వీరిలో 63శాతం మంది పురుషులు కాగా, 37శాతం మంది మహిళలున్నారు. ఇందులో 45శాతం మెట్రో/టైర్-1 పట్టణాల నుంచి, 31 శాతం మంది టైర్-2 పట్టణాలు, 24 శాతం టైర్-3 పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారున్నారు. బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డు సీవీవీ, ఏటీఎం పాస్ వర్డులు, ఆధార్ లేదా పాన్ నెంబరు మొదలైన వ్యక్తిగత ఆర్థిక వివరాలను సాధారణంగా ఎలా సేవ్ చేస్తున్నారని అడిగినప్పుడు.. 7శాతం మంది ''నా ఫోన్ లో'', 15 శాతం మంది ''నా ఈమెయిల్ లేదా కంప్యూటర్ లో'' అని చెప్పారు. 11శాతం మంది ''ఫోన్, ఈమెయిల్ లేదా కంప్యూటర్''లో స్టోర్ చేసుకుంటున్నామని వెల్లడించారు. అయితే, 21 శాతం మంది ఆ వివరాలు తాము గుర్తువుంచుకున్నామనీ, 39 శాతం మంది పేపర్లో రాసుకున్నామని తెలుపగా, 7 శాతం మంది ఏ అభిప్రాయం వెల్లడించలేదు. మొత్తంగా 33 శాతం మంది తమ గోప్యమైన తమ వ్యక్తిగత వివరాలు డిజిటల్‌గా ముఖ్యంగా మొబైల్, ఈ-మెయిల్, కంప్యూటర్లలో స్టోర్ చేసుకుంటున్నారని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి.
ఇలా అత్యంత గోప్యమైన ఆర్థిక వివరాలను నిల్వ చేయడం వల్ల కలిగే పెను ప్రమాదాన్ని హైలైట్ చేస్తూ, డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర బ్యాంకులు సంఘటిత ప్రయత్నాలు చేయాల్సిన అత్యవసర అవసరాన్ని లోకల్ సర్కిల్ సర్వే నొక్కి చెప్పింది.