Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్ఐసి ఐపీఓలో కేంద్రం యోచన
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లో విదేశీ సంస్థాగత మదుపర్లకు 20శాతం వాటా కొనుగోలుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. సెక్యూరిటీస్ ఎక్సేంజీ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) నిబంధనల ప్రకారం ఐపీఓలో ఎఫ్‌పీఐలు వాటాలు కొనుగోలు చేయడానికి వీలుంది. అయితే ఎల్ఐసీ చట్టంలో విదేశీ పెట్టుబడిదారులకు అవకాశం లేదు. ఎల్ఐసీ ఐపీఓ దేశంలోనే అతిపెద్దగా రానుంది. దాదాపుగా రూ.90వేల కోట్ల విలువ చేసే వాటాలను మార్కెట్ శక్తులకు విక్రయించాలని మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఇష్యూ కోసం మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేసినట్టు దీపమ్ సెక్రటరీ తూహిన్ కాంత పాండే ట్వీట్ చేశారు. ఇందులో ఎస్బీఐ కాపిటల్ మార్కెట్, జెఎం ఫైనాన్సీయల్, యాక్సిస్ కాపిటల్, బీఓఎఫ్ఏ సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్ ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కొటాక్ మహీంద్రా కాపిటల్ తదితర సంస్థలను లీడ్ మేనేజర్లు, సలహాదారులుగా నియమించుకున్నట్టు వెల్లడించారు.
ఈ ఐపీఓ నిర్వహణకు గత నెలలో 16 మర్చంట్ బ్యాకర్లను ప్రభుత్వం ఎంపిక చేసింది. లీగల్ అడ్వైజర్ నియామకం కోసం సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఈ బిడ్లను తర్వాత రోజే తెరువనున్నారు. ఎల్ఐసీలో ప్రతిపాదిత డిజిన్వెస్ట్మెంట్కు గత నెలలో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారత స్టాక్ మార్కెట్లలో ఇది వరకు ఎప్పుడూ ఇంత పెద్ద ఇష్యూ నమోదు కాలేదని దీపమ్ ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థల్లో రూ.8,368 కోట్ల విలువ చేసే వాటాలను కేంద్రం విక్రయించింది. ప్రయివేటు రంగం నుంచి తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ వినూత్నమైన పాలసీలతో ఎల్ఐసీ మార్కెట్లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి ప్రీమియం వసూళ్ల పరంగా చూస్తే ఎల్ఐసీ వాటా 66.18 శాతంగా ఉంది. ఇక. పాలసీల సంఖ్యపరంగా చూసినా 74.58శాతం మార్కెట్ వాటాతో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా 8 జోనల్, 113 డివిజినల్ కార్యాలయాలు, 2048 శాఖలు, లక్షమందికి పైగా ఉద్యోగులు, 13.53 లక్షల ఏజెంట్లతో ఎల్ఐసీ సేవలందిస్తోంది.