Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూకుమ్మడిగా మొబైల్ చార్జీల పెంపు..!
- త్వరలోనే టారీఫ్‌లు పెంచొచ్చు
- ఆదాయాలపై కంపెనీల దృష్టి
న్యూఢిల్లీ : టెలికం రంగంలోని పోటితత్వం పూర్తిగా కనుమరుగు కానున్నదని స్పష్టమైన సంకేతాలు వస్తోన్నాయి. ప్రయివేటు టెల్కోలు ఒక్కటై మూకుమ్మడిగా చార్జీలు పెంచే పనిలో ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే రెండు, మూడు దఫాలుగా పలు చార్జీలను పెంచిన టెలికం కంపెనీలు వచ్చే రెండు, మూడు మాసాల్లో వినియోగదారులపై భారాలు మోపనున్నాయని సమాచారం. కంపెనీలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి టారీఫ్‌లను మరోసారి హెచ్చించే అవకాశాలున్నాయని భారతీ ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ వ్యాఖ్యల్లో స్పష్టం అవుతోంది. ఇకపై టెలికం సంస్థల మధ్య భిన్న విధానం (కార్టెలైజేషన్) ఉండబోదని సునీల్ మిట్టల్ పేర్కొనడమే ఇందుకు నిదర్శనం.
మోడీ సర్కార్ ఈ రంగానికి ఇటీవలే భారీ ఉద్దీపనలు ప్రకటించిన విషయం తెలిసిందే. రుణాలు, బకాయిలపై నాలుగేండ్ల మారిటోరియం అవకాశం కల్పించింది. 100 శాతం ఎఫ్‌డీఐలకు తెర లేపింది. కేంద్రం నుంచి భారీగా ప్రోత్సాహకాలు పొందనున్న ఈ పరిశ్రమలోని కార్పొరేట్ దిగ్గజాలు ముకేశ్ అంబానీ, సునీల్ మిట్టల్, ఆదిత్యా బిర్లా మరోవైపు ఛార్జీల పెంపునపై దృష్టి సారించారని తెలుస్తోంది. ఇందుకు నిదర్శనం.. టెలికం సంస్థలు పోటీ వాతావరణం లేకుండా ప్లాన్లను ప్రకటించే అవకాశాలపై ఎయిర్టెల్ చైర్మెన్ సునీల్ మిట్టల్.. వొడాఫోన్ ఐడియా సీఈఓ నిక్ రీడ్‌తో చర్చించినట్లు రిపోర్ట్లు వచ్చాయి. అలాగే రిలయన్స్ జియోపై రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతోనూ మిట్టల్ మాట్లాడినట్లు స్వయంగా తెలిపారు. భారత టెలికం రంగ కలలను సాకారం చేయాలంటే పరిశ్రమ ఉమ్మడిగా పని చేయాలన్నారు.
టెలికం రంగాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లేందుకు టెలికం సేవల అధినేతలు చేతులు కలుపాల్సి ఉందని మిట్టల్ పేర్కొన్నారు. మార్కెట్ పంపిణీపై ఆరోగ్యకరమైన చర్చలు జరిగాయనీ, టారిఫ్‌లపై కాదని అన్నారు. కాగా వీరి కలలు ఆయా టెలికం కంపెనీల లాభార్జనపైనే ఉంటుంది.. తప్పా ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన సేవలపై దృష్టి ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజల నుంచి ఎలా చార్జీలు పిండాలనే దానిపైనే ఈ కార్పొరేట్ల ఆలోచనలు ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వినియోగదారుల నుంచి నెలకు సగటు రాబడి (ఏఆర్పీయూ) రూ.220గా ఉంది. దీన్ని కనీసం రూ.250 నుంచి రూ.300కు చేర్చాలని టెలికం కంపెనీల లక్ష్యంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే పెరిగిన ధరలతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.