Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగేండ్లలో భారత్‌లో వ్యయం
న్యూఢిల్లీ : అమెరికన్ ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ భారత్‌లో తన వ్యాపార న్యాయ సంబంధిత కేసుల కోసం ఏకంగా వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలిపింది. గడిచిన 2018-20 మధ్య కాలంలో లీగల్ ఖర్చుల కింద రూ.8546 కోట్లు (1.2 బిలియన్ డాలర్లు) వ్యయం చేసినట్లు అమెజాన్ తన పబ్లిక్ ఖాతాల్లో వెల్లడించింది. 2018-19లో రూ.3,420 కోట్లు, 2019-20లో రూ.5,126 కోట్ల చొప్పున ఖర్చు చేసినట్టు తెలిపింది. ఈ బహుళజాతి కార్పొరేట్ దిగ్గజం భారత్‌లో అమెజాన్ ఇండియా లిమిటెడ్, అమెజాన్ రిటైల్ ఇండియా, అమెజాన్ సెల్లర్ సర్వీసెస్, అమెజాన్ ట్రాన్స్‌పోర్టేషన్, అమెజాన్ హోల్‌సేల్, అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ పేర్లతో ఆరు కంపెనీలను కలిగి ఉంది. ఈ కంపెనీలు ఎదుర్కొంటున్న న్యాయ సమస్యల పరిష్కారానికి వేల కోట్లు వెచ్చించడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది.
ప్యూచర్ గ్రూపును రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేసిన ఒప్పందాని సవాల్ చేస్తూ అమెజాన్ కోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. మరోవైపు అమెజాన్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నుంచి దర్యాప్తును ఎదుర్కొంటుంది. విక్రయ పద్దతుల్లో అవకతవకలకు పాల్పొడుతోందనే విమర్శలు ఉన్నాయి. లీగల్ ఖర్చులపై వ్యాఖ్యానించేందుకు అమెజాన్ నిరాకరించింది. అమెజాన్ తన ఆదాయంలో 20 శాతం న్యాయవాదులకే ఖర్చుచేయడం ప్రశ్నార్థకమని ది కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) విమర్శించింది. దేశంలో లంచాలివ్వడానికే అమెజాన్, దాని సబ్సిడరీలు వాటి ఆర్థిక వనరుల్ని వినియోగిస్తున్నాయడానికి పెద్ద మొత్తంలో లీగల్ వ్యయాలే నిదర్శనమని సిఎఐటి జాతీయ కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ ఆరోపించారు. అమెజాన్ న్యాయ ఖర్చులపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూశ్ గోయల్‌కు ఖండేల్వాల్ లేఖ రాశారు. 2018-20లో అమెజాన్‌కు రూ.45వేల కోట్ల రెవెన్యూ వస్తే అందులో రూ.8500 కోట్లు లీగల్ వ్యయాలు ఉండటంపై అనుమానాలు వ్యక్తం చేశారు.