Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 958 పాయింట్ల ర్యాలీ
- మదుపర్లకు రూ.3.14 లక్షల కోట్ల సంపద
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు నూతన రికార్డులను నెలకొల్పాయి. సెన్సెక్స్ 60వేల పాయింట్ల చేరువలో నమోదైంది. మదుపర్లు ఒక్క పూటలోనే రూ.3లక్షల కోట్ల మేర లాభపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పరిణామాలు, మోడీ అమెరికా పర్యటనపై ఇన్వెస్టర్ల ఆశలు కొనుగోళ్లకు మద్దతునిచ్చాయి. దేశంలో మెరుగైన వర్షాలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం మార్కెట్లలో విశ్వాసాని నింపింది. ఈ సానుకూల పరిణామాలతో బీఎస్ఈ సెన్సెక్స్ 958 పాయింట్లు లేదా 1.63 శాతం రాణించి 59,885.36కు చేరింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 276.30 పాయింట్లు లేదా 1.57 శాతం లాభపడి 17,822.95 వద్ద ముగిసింది.ఒక్క పూటలో మదుపర్ల సంపద రూ.3.14 లక్షల కోట్లు పెరగడంతో బీఎస్ఈ క్యాపిటలైజేషన్ రూ.261.71 లక్షల కోట్లకు చేరింది. నిఫ్టీలో బజాజ్ ఫిన్సర్వ్, హిందాల్కో ఇండిస్టీస్, టాటా మోటార్స్, లర్సన్ అండ్ టర్బో, కోల్ ఇండియా షేర్లు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు హెచ్డీఎఫ్సీ లైఫ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, నెస్ల్టే ఇండియా, ఐటీసీ, టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో టాప్లో ఉన్నాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1 శాతం చొప్పున పెరిగాయి. రియాల్టీ సూచీ ఏకంగా 9 శాతం పెరిగింది. ఐటీ, లోహ, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1 శాతం పైన లాభపడ్డాయి.