Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3,4 పీఎస్‌యూలు మినహా..
- ఈ ఏడాది నిలిచిపోనున్న చరిత్ర
- మార్చి కల్లా బీపీసీఎల్ అమ్మకం
- ఎల్ఐసీలో డిజిన్వెస్ట్‌మెంట్ : సీఈఏ సుబ్రమణ్యన్
న్యూఢిల్లీ : దేశంలోని దాదాపు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తామని ఆర్థిక ముఖ్య సలహాదారు (సీఈఏ) క్రిష్ణమూర్తి సుబ్రమణ్యియన్ అన్నారు. చరిత్రలో ఈ ఏడాది ముఖ్యమైందిగా నిలిచిపోనుందన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ఏర్పాటు చేసిన లీడర్షిప్ సమ్మిట్ 2021 సదస్సులో సుబ్రమణ్యియన్ పాల్గొని మాట్లాడుతూ ప్రయివేటీకరణకు అత్యంత కీలకమైన ఏడాదిగా నిలవనున్నదన్నారు. రూ.1.75 లక్షల కోట్ల విలువ చేసే పీఎస్‌యూల వాటాలను విక్రయించాలని మోడీ సర్కార్ బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే ఎయిరిండియా అమ్మక ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇందుకోసం రెండు బిడ్లు వచ్చాయన్నారు. అదే విధంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌ను ప్రయివేటుపరం చేస్తున్నామన్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో వాటాలను ప్రభుత్వం విక్రయిస్తుందన్నారు. వచ్చే మార్చి త్రైమాసికంలో ఎల్ఐసీ లిస్టింగ్‌కు రానుందన్నారు. ''ప్రయివేటు రంగానికి సాధికారిత కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసమే 'ఆత్మనిర్భర్ భారత్'ను ప్రారంభించాం. మౌలిక వసతుల రంగంలో కల్పించే ఉద్యోగాలు ఇతర రంగాల్లో మరిన్ని ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తాయి. పశ్చిమ దేశాలతో పోటీ పడినప్పుడే భారత్ స్వాలంబన సాధించినట్లు. వచ్చే 8-10 ఏండ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఉన్న దాని కంటే భిన్నంగా, సమర్థంగా ఉంటుంది. వచ్చే దశాబ్ద కాలంలో మూడు, నాలుగు కీలకమైన రంగాల్లో కేవలం 3-4 పెద్ద ప్రభుత్వ రంగ కంపెనీలు మాత్రమే ఉంటాయి. మిగిలిన అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తాం.''అని సుబ్రమణ్యన్ తెలిపారు. గత నెలలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి ఆస్తుల ప్రయివేటీకరణకు సంబంధించి నేషనల్ మానిటైజేషన్ పైపులైన్ (ఎన్ఎంపీ)ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో అన్ని ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టనున్నట్టు స్పష్టం చేశారు.