Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాదిలోనే ఐపీవోకు తీసుకురావాలనే లక్ష్యం: ఆర్థికశాఖ ఉన్నతాధికారులు
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బీమా సంస్థ అయిన భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తొలి పబ్లిక్ ఆఫర్ ((ఐపీవో) కోసం చురుగ్గా అడుగులు పడుతున్నాయి. వచ్చే నెలలో (నవంబర్) ఎల్ఐసీ ఐపీవోకు సంబంధించిన ప్రాథమిక పత్రాలను మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీకి సమర్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆర్థికశాఖలోని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసీని ఐపీవోకు తీసుకురావాలన్న లక్ష్యం తమ ముందున్నదనీ, అందుకు నిర్దిష్టమైన కాలపరిమితులు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నవంబరులో సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. కాగా, ఐపీవోకు వీలుగా ఇప్పటికే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నిబంధనలు-1956కు మార్పులు చేసింది. మార్కెట్ ఎక్స్ఛేంజీల్లో నమోదు కావడానికి అనువుగా, లిస్టింగ్ నిబంధనలు అనుసరించి బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లను నియమించనున్నారు. దీంతోపాటు ఎల్ఐసీ చైర్మెన్ పదవీ విరమణ వయసు నిబంధనలను సైతం సవరించారు. ప్రస్తుతం ఉన్న 60 సంవత్సరాలకు బదులుగా 62 ఏండ్లకు పెంచారు.
ఇదిలావుండగా, ఎల్ఐసీ ఐపీవోను నిర్వహించడానికి 10 మర్చంట్ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఎంపిక చేసింది. ఇందులో గోల్డ్మన్ శాక్స్, సిటీ గ్రూప్, కోటక్ మహీంద్రా, ఎస్బీఐ క్యాప్స్ ఉన్నాయి. వీటితో పాటు జేఎం ఫైనాన్షియల్, యాక్సిస్ క్యాపిటల్, నొమురా, బోఫా సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్ ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్లు ఉన్నాయని సమాచారం. సిరిల్ అమర్చంద్ మంగళ్దాస్ను న్యాయ సలహాదారుగా నియమించారు. మరోవైపు విదేశీ మదుపర్లను కూడా ఐపీవోలో పాల్గొనేందుకు అనుమతించే విషయంపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. సెబీ నిబంధనల ప్రకారం విదేశీయులు ఐపీవో ద్వారా షేర్లు కొనేందుకు అర్హులు. అయితే, ఎల్ఐసీ చట్టంలో మాత్రం విదేశీ పెట్టుబడులకు అనుమతి లేదు. ఈ చిక్కు ఎలా పరిష్కరించాలన్నదానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ ఆర్థిక ఏడాదిలో రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరేందుకు ఎల్ఐసీ ఐపీవోను బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.