Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక వేత్తల ఆందోళన
న్యూఢిల్లీ : సులభతర వాణిజ్య విధానాల (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) అమలులో వివిధ దేశాలకు ప్రపంచ ర్యాంకులను ప్రకటించడంలో అవతవకలు జరిగాయంటూ పలువురు ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వాణిజ్య రంగాన్ని ప్రభావితం చేసే ర్యాంకులను.. ఆయా దేశాలు కోరుకున్నట్టు గా ప్రపంచబ్యాంకు కట్టబెట్టిందని ఆరోపిస్తున్నారు. ప్రపంచబ్యాంకు ప్రతి ఏడాది ప్రకటించే ఈ ర్యాంకులను.. వివిధ దేశాలలో పెట్టుబడులు పెట్టే సంస్థలు పరిగణనలోకి తీసుకుంటాయని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. గత ఏడాదికి సంబంధించిన గణాంకాల ఆధారంగా విడుదల చేయాల్సిన ర్యాంకులను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్టు ప్రపంచబ్యాంకు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఇటీవల వెల్లడైంది. గతంలో ర్యాంకుల నిర్ణయంలో అవకతవకలు జరిగాయని వచ్చిన సమాచారంపై ఒక న్యాయసేవల సంస్థతో ప్రపంచబ్యాంకు విచారణ చేయించిందని, 2018, 2020 సంవత్సరాల్లో విడుదలైన ర్యాంకులలో చైనా, సౌదీ అరేబియా, అజర్బైజాన్ల విషయంలో అవకతవకలు జరిగాయని ఆ సంస్థ తేల్చింది. చైనాకు 2018లో 78వ ర్యాంకు వచ్చిందనీ, వాస్తవానికి సులభతర వాణిజ్యం విషయంలో చైనా మెరుగైన స్థితిలో అవకాశాలు కల్పిస్తున్నందున ప్రకటించినదానికంటే తక్కువ ర్యాంకు రావలసి ఉండేదని ఆ సంస్థ పేర్కొంది.
ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్రిష్టలీనా జార్జియేవా ర్యాంకుల వ్యవహారాలను పర్యవేక్షించారు. ఆమె ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్గా ఉండటంతో ఈ వ్యవహారం మరింత సంచలనమైంది. తాను ఏ తప్పు చేయలేదని ఆమె స్పష్టంచేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఐఎంఎఫ్ బోర్డు త్వరలో విచారించనుందని, ఆమెను ఆ పదవిలో కొనసాగించే విషయంపైనా చర్చ జరగనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ప్రపంచబ్యాంకు యాజమాన్యంలో నిజాయతీ లేదని గుర్తించే, దాని ప్రధాన ఆర్థికవేత్త పదవికి 2018 జనవరిలో తాను రాజీనామా చేశానని నోబెల్ అవార్డు గ్రహీత పాల రోమర్ పేర్కొన్నారు. చిలీకి సోషలిస్టు నేత మిచెల్ బ్యాచిలెట్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో ర్యాంకును తక్కువ చేసి చూపారని, ఆయన అనంతరం మితవాద నేత సెబాస్టియన్ పినెరా అధ్యక్షుడు అయ్యాక ర్యాంకును మెరుగుపరచారని తెలిపారు. ఈ విషయాలను తాను అప్పుడే క్రిష్టలీనా దష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన వెల్లడించారు. దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు మరికొంతమంది ఆర్ధికవేత్తలు. క్రిష్టలీనా 2019లో ఐఎంఎఫ్ అధ్యక్ష పదవిని చేపట్టాక అనేక సానుకూల చర్యలు చేపట్టారని, పెద్దగా ఆర్థిక వనరులు లేని దేశాలకు కరోనా సమయంలో భారీ ఎత్తున సంస్థ నుంచి నిధులు వెళ్లేలా చూశారని మరో నోబెల్ అవార్డు గ్రహీత జోసెఫ్.ఇ.స్టిగ్లెజ్ పేర్కొన్నారు. ఆయన కూడా గతంలో ప్రపంచ బ్యాంకుకు ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేశారు. ర్యాంకుల విభాగంతో ఆయనకు అప్పుడు సంబంధం లేదు. తన దష్టిలో ర్యాంకుల నివేదిక భయంకరమైనదని, కార్పొరేట్ పన్నులు తగ్గించి... కార్మిక చట్టాలను బలహీన పర్చే దేశాలకు మంచి ర్యాంకులు కేటాయిస్తాయని అన్నారు.