Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే ఏప్రిల్ నుంచి 8 రెట్ల చార్జీల పెంపు
- ద్విచక్ర వాహనాలపై బాదుడే
- వచ్చే ఏప్రిల్ నుంచి అమలు
న్యూఢిల్లీ : పదిహేను సంవత్సరాలు దాటిన పాత కార్ల రెన్యూవల్ భారం కానుంది. ఈ ఛార్జీలను అమాంతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి రెన్యూవల్ రిజిస్ట్రేషన్ ఫీజును ఏకంగా ఎనిమిది రెట్లు పెంచింది. దీంతో పాత వాహనాల వాడకాన్ని నిరుత్సాహ పర్చడం ద్వారా. కొత్త వాహనాల కొనుగోళ్లను పెంచాలనేది ప్రధాన ఉద్దేశ్యం. పెంచిన ఛార్జీలు 2022 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. వాణిజ్య వాహనాలు, ట్రక్కులు, బస్సులు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఫిట్నెస్ ధృవీకరణ రెన్యూవల్‌కు వెళ్లిన ప్రస్తుతమున్న ఫీజు కంటే ఎనిమిది రెట్లు ఎక్కువగా చెల్లించాల్సిందేనని సోమవారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఢిల్లీ, దాని పొరుగు ప్రాంతాల్లోని వాహనాలకు ఇది వర్తించదు. అక్కడ 10 సంవత్సరాలు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలపై ఇప్పటికే నిషేధం కొనసాగుతుంది.
ప్రస్తుతం 15సంవత్సరాలు దాటిన వాహనాలపై రిజిస్ట్రేషన్ రెన్యూవల్ ఫీజు రూ.600గా ఉంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం అది రూ.5,000కు చేరనుంది. అదే విధంగా పాత ద్విచక్ర మోటార్ వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చార్జీలు రూ.300 నుంచి రూ.1,000కి పెరగనున్నాయి. 15 సంవత్సరాలు దాటిన బస్, ట్రక్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ఇప్పుడు రూ.1500 చెల్లించాల్సి ఉండగా.. ఈ మొత్తం వచ్చే ఏప్రిల్ నుంచి రూ.12,500కు చేరనుంది.
జాప్యమైతే భారీ మూల్యమే
ప్రయివేటు వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేసుకోవడం జాప్యమైతే జరిమాన రోజువారి బాదుడు ఉంటుందని ఈ నోటిఫికేషన్లో తెలిపింది. ప్యాసింజర్ వాహనాల రిజిస్ట్రేషన్ ఆలస్యానికి నెలకు రూ.300, వాణిజ్య వాహనాలకు ఏకంగా రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ జాప్యమైతే రోజుకు రూ.50 జరిమానా విధిస్తారు. 15 ఏళ్లు దాటిన తర్వాత పాత ప్యాసింజర్ వాహనాలకు ప్రతి ఐదేళ్లకోసారి రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. 8 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలకు ప్రతీ ఏడాది ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. వాహనాలకు మాన్యువల్ అండ్ ఆటోమేటెడ్ ఫిట్ టెస్ట్‌కూ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. స్వచ్ఛంద పాత వాహనాల స్క్రాపింగ్ స్కీం కింద ఫిట్నెస్ టెస్ట్ సెంటర్ల ఏర్పాటుకు కూడా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్లో మార్గదర్శకాలు, నిబంధనలు ఖరారు చేసింది.