Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఎయిరిండియా ప్రయివేటీకరణపై ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం తదుపరి అనుబంధ సంస్థల మానిటైజేషన్ పనులను ప్రారంభించనున్నట్టు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలిపారు. ఎయిరిండియా అలయన్స్ ఎయిర్ సహా నాలుగు అనుబంధ సంస్థలకు చెందిన కీలకం కాని ఆస్తులను విక్రయించనున్నామన్నారు. రూ.14,700 కోట్లకుపైగా విలువైన భవనాలు, భూమి తదితర ఆస్తులు అమ్మకం జాబితాలో ఉన్నాయని తెలిపారు. ఎయిరిండియాకు చెందిన ఈ నాలుగు అనుబంధ సంస్థలు ఏఐఏహెచ్ఎల్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంపెనీ(ఎస్పీవీ)లో భాగమని తెలిపారు. ఈ నెల 8న ఎయిరిండియాను రూ.18,000 కోట్ల బిడ్‌తో టాటా గ్రూప్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం నగదు పద్దతిలో రూ. 2,700 కోట్లు చెల్లించనుంది. అంతేకాకుండా రూ.15,300 కోట్ల రుణాలను చెల్లించనుంది. ఈ ఒప్పందం డిసెంబర్ కల్లా పూర్తి కావచ్చని అంచనా. ఒప్పందంలో భాగంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌తో పాటు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవల సంస్థ ఏఐఎస్ఏటీఎస్ సంస్థలను టాటా గ్రూప్ స్వాధీనం చేసుకోనుంది.