Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రక్త నాళాల్లో ఎన్నో కారణాల చేత రక్తం గడ్డకట్టడం లేదా థ్రోంబోసిస్ ఏర్పడుతోందని, కోవిడ్ -19 తరువాత ఈ కేసులు పెరిగాయాని కేర్ హాస్పటల్ వైద్యులు డా.పిసి గుప్త తెలిపారు. రక్తం గడ్డకట్టడం వలన అవయవ ధమనులు లేదా ధమనుల నుంచి మెదడు లేదా గుండె లేదా బృహధ్ధమని నుంచి ప్రేగులకు ప్రయాణించడం జరుగుతుంది. ఇవి ప్రధానంగా ధమనులు లేదా నరాలలో రక్తం గడ్డకట్టేందుకు అనువుగా పరిస్థితులు ఉన్న ఎడల ఏర్పడతాయి. శస్త్ర చికిత్స చేయించుకోవడం, తీవ్రమైన డీహైడ్రేషన్, దీర్ఘకాలం పాటు విశ్రాంతి తీసుకోవాల్సి రావడం లేదా అనారోగ్యం, గాయం కావడం, క్యాన్సర్ ఉండటం, క్యాన్సర్ కీమోథెరఫీ తీసుకోవడం, సెంట్రల్ వీన్ క్యాథటరైజేషన్, నోటి ద్వారా గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం, వయసు పెరగడం, తీవ్రమైన అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో చేరాల్సి రావడం మరియు కుటుంబంలో ఈ తరహా చరిత్ర ఉండటం కూడా థ్రోంబోసిస్ ఏర్పడేందుకు కారణమవుతుంది. కోవిడ్–19 ఇప్పుడు రక్తంలో గడ్డలు ఏర్పడటానికి తాజా, అతి ముఖ్యమైన కారణంగా మారుతుంది.
రక్తంలో ఏర్పడే ఈ గడ్డలు కారణంగా పలు సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఆ గడ్డలు ఏర్పడిన ప్రాంతానికి అనుగుణంగా ఈ తీవ్రత ఆధారపడి ఉంటుంది. నరాలలో ఏర్పడే గడ్డలు ఊపిరితిత్తులకు ప్రయాణించే అవకాశాలున్నాయి. దీనినే మనం పల్మనరీ ఎంబోలిజంగా పిలుస్తుంటాము. ఇది అత్యంత ప్రాణాంతకమైన స్థితి. ధమనుల్లో ఏర్పడే గడ్డలు కారణంగా ఆ ధమనులు రక్తం పంపించే అవయవాలు పాడవడంతో పాటుగా స్ట్రోక్, హార్ట్ ఎటాక్ లేదా అవయవాలు కోల్పోవడం లేదా ప్రేగులలో సమస్యలు రావొచ్చు. ముందుగా సమస్యను గుర్తించడం మరియు చికిత్స చేయడమనేది అవయవాలు నష్టపోవడం లేదా ప్రాణాంతిక సమస్యల నుంచి బయటపడేందుకు తోడ్పడుతుంది. అయితే, నివారణ అనేది ఈ రక్తం గడ్డకట్టకుండా అడ్డుకోవడంలో అత్యంత కీలకమైన అంశం.
నివారణ కోసం ఏం చేయాలంటే ....
1. ఊబకాయం నివారించాలి. తగిన శరీర బరువు నిర్వహించాలి
2. సహేతుకమైన ,చురుకైన జీవనశైలి అనుసరించాలి
3. మంచినీరు తగినంతగా తీసుకోవాలి
4. గుండె వద్ద రక్తం గడ్డకట్టేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
5. శస్త్రచికిత్స అయిన తరువాత లేదా హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చిన పరిస్థితులలో నివారణ మందులు వాడాల్సి ఉంటుంది.
6. కుటుంబంలో థ్రోంబోసిస్ స్థితి గతంలో చూసిన ఎడల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది
7. పొగాకును ఏ రూపంలోనూ వినియోగించరాదు
8. సూచించిన ఎడల కంప్రెషన్ స్టాకింగ్స్ వినియోగించాలి అలాగే సుదీర్ఘ సమయం విమాన ప్రయాణాలు చేసే సమయాలలో కూడా వీటిని ధరించాలి
ముందుగా గుర్తించడం
అకస్మాత్తుగా నొప్పి లేదా వాయడం అనేది రెండు కాళ్లలోనూ కనిపించడం, కడుపులో విపరీతంగా నొప్పి రావడం, అకస్మాత్తుగా శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది లేదా ఛాతీలో నొప్పి లేదా స్ట్రోక్ వంటివి రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడవచ్చు, ఇలాంటి పరిస్ధితులలో తక్షణమే వైద్య సహాయం తీసుకోవడం ద్వారా సుదీర్ఘకాల అనారోగ్యం, అవయవాలు కోల్పోవడం లేదా ఆఖరకు మరణాలను సైతం నివారించవచ్చు.
మీ డాక్టర్ క్లీనికల్గా మీ న స్ధితిని పరిశీలించడంతో పాటుగా డీ–డైమర్, అలా్ట్రసౌండ్, సీటీ యాంజియోగ్రఫీ వంటి పరీక్షలను రోగనిర్ధారణ కోసం సూచించడం తో పాటుగా చికిత్స ప్రణాళిక చేయవచ్చు.
రక్తం గడ్డకట్టిన పరిస్థితులలో చికిత్స సాధారణంగా ...
· యాంటీ కోయాగ్యులెంట్ : రక్తం గడ్డే కట్టే అవకాశాలు తగ్గిస్తూ ఔషదాలు అందించడం
· క్లాట్ బ్లస్టర్ థెరఫీ : దీనిలో ఓ కాథెటర్ను రక్తం గడ్డకట్టిన ప్రాంతానికి పంపి, ఆ గడ్డను థ్రోంబోలిటిక్ చికిత్స వినియోగించి తొలగిస్తారు. ఈ గడ్డలను ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కాథెటర్స్ వినియోగించి బయటకు లాగడమూ చేస్తారు.
· ఐవీసీ ఫిల్టర్లు లేదా అంబ్రెల్లాలను భారీ గడ్డలు ఊపిరితిత్తుల వైపు వెళ్లకుండా ఏర్పాటుచేయవచ్చు. యాంటీకోయాగ్యులెంట్ చికిత్సను బ్లీడింగ్ సమస్యల కారణంగా ఇవ్వలేని పరిస్థితులలో దీనిని అందించవచ్చు.
· రక్తంలో గడ్డలు తొలగించడానికి శస్త్రచికిత్స అవసరం పడవచ్చు : సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లోనే దీనిని చేస్తారు.
అయితే, ఆరోగ్యవంతమైన జీవనశైలి కారణంగా చాలా వరకూ ఈ గడ్డలను నివారించడం జరుగుతుంది. ఆరోగ్యవంతమైన ఆహారం (తాజా పళ్లు మరియు కూరగాయలు, గింజధాన్యాలు, తగినంతగా ప్రొటీన్ తీసుకోవడంతో పాటుగా అధికంగా ఆహారం తీసుకోవడం నివారించాలి. అలాగే ట్రాన్స్ఫ్యాట్స్ తీసుకోరాదు) తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలి (ఊబకాయం నివారించుకోవాలి), ఆరోగ్యవంతంగా నడవాలి (వారానికి కనీసం నాలుగు రోజుల పాటు 45 నిమిషాల పాటు నడక నడవడం) మరియు ఆరోగ్యవంతంగా తాగడం (తగినంతగా నీరు తీసుకోవడం) చేయాలి.