Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్క పూటలో 22 శాతం పరుగు
- సెన్సెక్స్ 453 పాయింట్ల ర్యాలీ
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు కొనుగోళ్ల మద్దతుతో బుధవారం భారీగా లాభపడ్డాయి. దీంతో వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్న కొద్దీ జోరందుకున్నాయి. ముఖ్యంగా టాటా మోటార్స్ షేర్ పరుగులు పెట్టింది. ఐటి, లోహ, మౌలిక వసతుల సూచీల మద్దతుతో బీఎస్ఈ సెన్సెక్స్ 453 పాయింట్లు పెరిగి 60,737 రికార్డ్ స్థాయికి చేరింది. ఒక దశలో 60,836 పాయింట్ మార్క్‌ను తాకింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 170 పాయింట్లు పెరిగి 18,161 వద్ద ముగిసింది. టాటా మోటార్స్ షేరు ఏకంగా 22 శాతం పెరిగి రూ.523 ఆల్‌టైం గరిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. ఆ కంపెనీ విద్యుత్ వాహన విభాగం టిపిజి రైజ్ క్లైమెట్ నుంచి రూ.7500 కోట్ల నిధులు సమీకరించిన నేపథ్యంలో సూచీకి డిమాండ్ పెరిగింది. ఏడాది క్రితం రూ.126 వద్ద నమోదైన టాటా మోటార్స్ షేరు ఏకంగా 415 శాతం పెరిగింది. మూడు రోజుల్లోనే 46 శాతం ర్యాలీ చేసింది. దీంతో కంపెనీ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.1.81 లక్షల కోట్లకు చేరింది. బీఎస్ఈలో 1602 షేర్లు లాభపడితే, 1504 స్టాక్స్ ప్రతికూలతను చవి చూశాయి. మరోవైపు 118 షేర్లు యథాతథంగా నమోదయ్యాయి. నిఫ్టీలో టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, పవర్ గ్రిడ్ కార్ప్, ఐటీసీ షేర్లు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు మారుతి సుజుకి, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, హెచ్‌యుఎల్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. రంగాల వారిగా వాహన సూచీ 3.5 శాతం ఇంధనం, ఇన్ ఫ్రా, ఐటీ, లోహ, విద్యుత్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 1 శాతం మేర పెరిగాయి.