Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే వారమూ ఒత్తిడిలోనే ఉండొచ్చు
- తరలిపోతున్న ఎఫ్ఐఐలు
ముంబయి : దేశ ఆర్థిక వ్యవస్థ పెద్ద ఆశజనకంగా లేకపోయినప్పటికీ.. భారత స్టాక్ మార్కెట్లు కరోనా కాలంలోనూ పరుగులు పెట్టాయి. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా భారీ లాభాలతో నూతన రికార్డులను చేరాయి. కాగా.. ఇటీవల వరుస నష్టాలతో స్టాక్ మార్కెట్ల బుడగ పేలిపోతుంది. ఇదే క్రమంలో నవంబర్ 1తో ప్రారంభమయ్యే వారంలోనూ మార్కెట్లు ప్రతికూలతను ఎదుర్కొనే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలపై మదుపర్ల నిరుత్సాహాం, ఆర్థిక వ్యవస్థలో కొత్తగా ఎలాంటి సానుకూల సంకేతాలు కానరాకపోవడంతో అమ్మకాలు కొనసాగొచ్చని విశ్లేషిస్తున్నారు. గడిచిన వారంలో విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.15,702.26 కోట్ల విలువ చేసే ఈక్విటీలను విక్రయించారు. గడిచిన వారంలో సెన్సెక్స్్, నిఫ్టీలు 2 శాతం పైగా నష్టపోయాయి. గురువారం నాటికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గడువు ముగింపు, అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనతలు, ఎఫ్ఐఐలు తరలిపోవడం మార్కెట్లను కుదేలు చేశాయి. గత వారం సెన్సెక్స్ 1,514.69 పాయింట్లు లేదా 2.49 శాతం కోల్పోయి 59,306.93 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 443.2 పాయింట్లు లేదా 2.44 శాతం నష్టపోయి 17,671.7 వద్ద ముగిసింది. గడిచిన ఎనిమిది సెషన్లలో బిఎస్ఇలో లిస్టెడ్ కంపెనీలు సుమారు రూ.17 లక్షల కోట్ల మేరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ను కోల్పోయాయి. అంటే ఈ మొత్తాన్ని మదుపర్లు నష్టపోయారు.