Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.400 కోట్లతో సల్పూరిక్ ఆసిడ్ యూనిట్
హైదరాబాద్ : మురుగప్ప గ్రూపునకు చెందిన కోరమండల్ ఇంటర్నేషనల్ విశాఖపట్నంలో సల్పూరిక్ ఆసిడ్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రోజుకు 1650 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ను రూ.400 కోట్ల పెట్టుబడితో అందుబాటులోకి తేనున్నామని పేర్కొంది. దీన్ని మోన్శాంటో ఎన్విరో- కెమ్ సిస్టమ్స్ (మెక్స్), థైసెన్క్రూప్ ఇండిస్టీయల్ సొల్యూషన్స్ (టికెఐఎస్) సాంకేతిక భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం ఆయా సంస్థలతో ఒప్పందం కుదర్చుకున్నట్లు వెల్లడించింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద సల్పూరిక్ ఆసిడ్ దిగుమతిదారుగా భారత్ ఉందని కోరమండల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అరుణ్ అళగప్పన్ తెలిపారు. ప్రతీ ఏడాది దాదాపుగా 20 లక్షల మెట్రిక్ టన్నుల సల్పూరిక్ను దిగుమతి చేసుకుంటుందన్నారు. దిగుమతి ప్రత్నామ్నాయం, స్థానిక తయారీని ప్రోత్సహించడానికి విశాఖలో రోజుకు 1650 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పెట్టుబడి దేశంలో ఎరువుల స్వయం సమృద్థి, పాస్పెట్ ఎరువుల లభ్యతను మెరుగపర్చుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విశాఖలో ఉన్న కోరమండల్ ప్లాంట్లోనే దీన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ఒప్పంద సమావేశానికి కోరమండల్ ప్రెసిడెంట్ శంకర సుబ్రమణ్యన్, టికెఐఎస్ ఇండియా ఎండి రాజేష్ కామత్, మెక్స్ యుఎస్ఎ గ్లోబల్ లైసెన్సీంగ్ మేనేజర్ బెరియాన్ బ్లెర్, కోరమండల్ కమర్షియల్ ఫెర్టిలైజర్స్ హెడ్ నారాయణ్ వెళ్లాయాన్ హాజరయ్యారు.