Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్టవిరుద్ద వేదికల నియంత్రణకు చట్టం
న్యూఢిల్లీ : అక్రమ రుణ యాప్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) కొరడా ఝులిపించే పనిలో పడింది. నిబంధనలకు విరుద్దంగా ఉన్న లోన్ యాప్స్‌పై చర్యలు తీసుకునేందుకు కొత్త చట్టాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, మొబైల్ యాప్‌లు సహా డిజిటల్ రూపంలో రుణాలనిచ్చే సంస్థలపై నియంత్రణ ఎలా ఉండాలన్న విషయమై ఆర్బిఐ జనవరి 13న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జయంత్ కుమార్ దాస్ అధ్యక్షతన వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. చట్టవిరుద్ధంగా ఇస్తున్న డిజిటల్ రుణాలను నిరోధించేందుకు ప్రత్యేక చట్టాన్ని వర్కింగ్ గ్రూప్ సిఫారసు చేయనుందని సమాచారం. ఈ వర్కింగ్ గ్రూప్ సభ్యుల ప్యానల్ ఆన్లైన్లో మొత్తం 1100 రుణ యాప్స్ ఉండగా వాటిలో 600యాప్స్ చట్టవిరుద్దంగా కొనసాగుతున్నాయని గుర్తించింది. నిబంధనలకు విరుద్దంగా ఉన్న రుణ యాప్‌లను నిషేధించేలా కొత్త చట్టాన్ని అమలు చేయాలని ఆర్బిఐ తాజాగా కేంద్రానికి సూచించింది. ఆర్బిఐ వర్కింగ్ గ్రూప్ సిఫారసులపై డిసెంబరు 31 వరకు అభిప్రాయాలు తీసుకోనుంది. అనంతరం తుది నివేదిక ప్రాతిపదికన నియమనిబంధనలను అమలు చేయనుంది.