Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజామాబాద్ : అతిగా స్పందించే మూత్రాశయం (ఓఏబీ)అనేది అసౌకర్యమైన, ఇబ్బందికరమైన, బలహీన పరిచే స్ధితి. ఇక్కడ ప్రస్తావించాల్సిన శుభవార్త ఏమిటంటే, ముందుగానే సమస్యను గుర్తించడం ద్వారా ఈ స్థితిని చక్కగా నిర్వహించవచ్చు. అంతేకాదు, దీనికి చికిత్సనూ అందించవచ్చు. అయితే చాలామంది రోగులు చికిత్స కాదు కదా, కనీసం డాక్టర్ను సంప్రదించడానికే ఇష్టపడరు. మూత్రాన్ని అసలు నిలుపుకోలేని స్ధితిని ఓఏబీగా చెబుతారు. దీనికి సరిగా చికిత్స అందించని ఎడల, జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాదు రోజువారీ కార్యకలాపాలలోనూ సమస్యలను సృష్టిస్తుంది. వయసుతో పాటుగా ఓఏబీ లక్షణాలు కూడా పెరుగుతుంటాయి. వయసుమళ్లిన రోగులు తమకున్న లక్షణాలను డాక్టర్తో చర్చించడానికి ఇష్టపడక పోవడం వల్ల సమస్య మరింత జఠిలమవుతుంది.
ఈ మేరకు కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ శబరినాథ్,అంకం, హాస్పిటల్, మాట్లాడుతూ 'స్త్రీ, పురుషులిరువురికీ ఓఏబీ సమస్య రావొచ్చు. దేశంలో నివేదించని సమస్యగానే ఇది ఉంది. అందువల్ల ఎన్ని కేసులు ఉన్నాయనేది ఎవరికీ తెలీదు. అయితే ఓ అంచనా ప్రకారం 14శాతం మంది పురుషులు ఓఏబీతో బాధపడుతుంటే, 12శాతం మంది స్త్రీలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. మోనోపాజ్ దశలోని మహిళలతో పాటుగా ప్రోస్టేట్ సమస్యలతో బాధపడుతున్న పురుషులు ఈ ఓఏబీ సమస్య కూడా కలిగి ఉండవచ్చు. అలాగే మెదడు, వెన్నుముక సమస్యలు కలిగిన వారిలో కూడా ఓఏబీ కనిపించవచ్చు. వయసుతో పాటుగా అందరికీ ఓఏబీ రావాలని లేదు. అలాగని వయసుతో పాటు వచ్చే సమస్యగానూ చూడరాదు. తొలుత లక్షణాలు స్వల్పంగానే ఉన్నప్పటికీ కాలంతో పాటుగా అవి తీవ్రమై నిద్ర, శారీరక, మానసిక అనారోగ్యానికీ కారణం కావొచ్చు` అని అన్నారు.
ఓఏబీ నిర్వహణలో జీవనశైలి మార్పులు, ప్రవర్తన మార్పులు అత్యంత కీలకంగా ఉంటాయి. ఈ దశలో కూడా నియంత్రణ సాధ్యం కాకపోతే మందులు అందించడం జరుగుతుంది. అప్పటికీ సమస్య తీవ్రత తగ్గకపోతే మూత్రాశయ గోడలకు ఇంజెక్షన్లు అందించడం, మూత్రాశయ సంబంధిత నరాలకు విద్యుత్ అందించడం జరుగవచ్చు. అతి అరుదుగా మాత్రమే శస్త్ర చికిత్స చేస్తారు. ముందుగానే సమస్యను గుర్తించడం, తక్షణమే తగిన చికిత్సనందించడం ద్వారా ఓఏబీ లక్షణాలతో పాటుగా సమస్యలనూ నియంత్రించవచ్చు.అందువల్ల, మీకున్న సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఆలస్యం చేయవద్దు.