Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వడ్డీ రేట్లు యథాతథం.. రెండంకెల దిగువనే వృద్థి:ఆర్బిఐ
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ లేకుండానే ఫీచర్ ఫోన్లతోనూ డిజిటల్ చెల్లింపులు చేసే సదుపాయాన్ని త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఇప్పటి వరకు స్మార్ట్ఫోన్లలోనే ఈ సౌలభ్యం ఉండగా.. రాబోయే రోజుల్లో సాధారణ ఫోన్లలోనూ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) ఆధారిత సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. మూడు రోజుల పాటు సాగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) భేటీ వివరాలను బుధవారం దాస్ మీడియాకు వెల్లడించారు. చిన్న మొత్తాల లావాదేవీల ప్రక్రియను సులభతరం చేసే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయన్నారు. యుపిఐ చెల్లింపులకు జనాదరణ పెరిగేలా చేయాలనే లక్ష్యంతో ఫీచర్‌ఫోన్ల ద్వారా ఈ లావాదేవీలకు అవకాశం కల్పించనున్నామన్నారు. వాలెట్లు, కార్డులు, యుపిఐ ద్వారా చెల్లింపుల విధానంలో వసూలు చేసే ఛార్జీలపై చర్చా పత్రాన్ని విడుదల చేయనున్నామని శక్తికాంత దాస్ చెప్పారు.
వరుసగా 9వ సారి మారలే..!
ఎంపిసి భేటీలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో వరుసగా 9వసారి కూడా వడ్డీ రేట్లను మార్చకుండా వదిలేసినట్లయ్యింది. రెపోరేట్, రివర్స్ రెపోరేట్లను యథాతథంగా 4 శాతం, 3.35 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్‌పై ఇటీవలి ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర వ్యాట్ తగ్గింపుల నిర్ణయం వల్ల ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా వినియోగ డిమాండ్‌కు మద్దతు పెరుగొచ్చన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో భారత వృద్థి రేటు 9.5 శాతంగా నమోదయ్యే అవకాశాలున్నాయని ఆర్బిఐ అంచనా వేసింది. ఇదే సమయంలో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ 5.3 శాతంగా ఉండొచ్చని విశ్లేషించింది. ప్రస్తుత డిసెంబర్‌తో ముగిసే త్రైమాసికంలో వృద్థి అంచనాలను 6.8 శాతం నుంచి 6.8 శాతానికి కోత పెట్టింది. మార్చి త్రైమాసికంలో 6.1 శాతం నుంచి 6 శాతానికి పరిమితం కావొచ్చని అంచనా వేసింది.
డిజిటల్ కరెన్సీకి సవాళ్లు..
దేశంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సిబిడిసి)ని అందుబాటులోకి తెస్తే ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మోసాలు ప్రధాన సవాళ్లుగా నిలువనున్నాయని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. సిబిడిటిల్లో హోల్‌సేట్, రిటైల్ లాంటి రెండు రకాలు ఉన్నాయని డిప్యూటీ గవర్నర్ టి శంకర్ పేర్కొన్నారు. వీటిపై చాలా కసరత్తు జరుగుతుందన్నారు. దీనిపై పూర్తిగా స్పష్టత రావడానికి మరింత సమయం పడుతుందన్నారు. ఈ రెండింటిలో ఏది ముందు పూర్తి అయినా దానిపై పైలెట్ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. వర్చూవల్ కరెన్సీ అనుమతి సాధ్యాసాధ్యాల పాలసీపై ఆర్బిఐ చాలా జాగ్రత్తగా వ్యవహారిస్తుందని దాస్ తెలిపారు. వర్చూవల్ కరెన్సీ చుట్టు అనేక భద్రత రిస్కులు ఉన్నాయని శంకర్ తెలిపారు.