Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడీపీ రీసెర్చ్ వెల్లడి
న్యూఢిల్లీ : సమాజంలో ఇప్పటికీ పని చేసే చోటా మహిళలు అణగదొక్కబడుతూనే ఉన్నారు. హోదా, పదోన్నతి, వేతనాల్లో ఈ వివక్ష కొనసాగుతూనే ఉంది. కరోనా సంక్షోభం తర్వాత ఇది మరింత పెరిగింది. వైరస్ ఉదృతి కాలంలో స్త్రీ, పురుషుల మధ్య వేతన చెల్లింపుల పరంగా అసమానత పెరిగినట్టు ఏడీపీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అధ్యయనంలో వెల్లడయ్యింది. 'పీపుల్ ఎట్ వర్క్ 2021: ఏ గ్లోబల్ వర్క్‌ఫోర్స్ వ్యూ' పేరుతో ఎడిపి ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా 17 దేశాల్లో మొత్తం 32,471 మంది ఉద్యోగుల అభిప్రాయాలను ఎడిపి సేకరించింది. 2020 నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఈ సర్వే చేపట్టింది. ఆ వివరాలు.. వేతన పెంపులు, బోనస్‌ల పరంగా చూస్తే పురుషల కంటే మహిళలు వెనుకబడి ఉన్నారు. పురుష ఉద్యోగుల్లో 70 శాతం మందికి వేతనాల పెంపు, బోనస్‌లను ఆయా సంస్థలు ప్రకటించాయి. కాగా.. అదే స్థాయి బాధ్యతలు చూస్తున్న మహిళల్లో 65 శాతం మందికి మాత్రమే వేతన పెంపు, బోనస్‌లు అందాయి. కరోనా కాలంలో పురుషులతో సమానంగా మహిళలూ కూడా బాధ్యతలను నిర్వర్తించినప్పటికీ యాజమాన్యాలు వివక్షను ప్రదర్శించాయని ఈ సర్వేలో తేలింది. ఈ వివక్ష ఒక్క పూటలో పోయేది కాదని ఏడీపీ హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ యున్నె టాయే పేర్కొన్నారు. దీనికి మూడు, ఐదేండ్ల దీర్ఘకాల ఎత్తుగడలు, ప్రణాళికలు అవసరమన్నారు.