Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్బీఐ అనుమతి
న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని ఇండుస్‌ఇండ్ బ్యాంక్‌లో బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తన వాటాను 9.99 శాతానికి పెంచుకోవడానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ఇందులో ఎల్ఐసికి ప్రస్తుతం 4.95 శాతం వాటా ఉంది. ఏడాది పాటు అంటే 2022 డిసెంబర్ వరకు వాటాను దాదాపు రెట్టింపు చేసుకోవడానికి తాజా అనుమతులు లభించినట్టు ఇండుస్‌ఇండ్ బ్యాంక్ శుక్రవారం రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ప్రయివేటు బ్యాంక్‌ల్లో ఏ సంస్థ అయినా 5 శాతం మించి వాటా సొంతం చేసుకోవాలంటే ఆర్బీఐ అనుమతులు తప్పనిసరి. గడిచిన నవంబర్లోనూ కొటాక్ మహీంద్రా బ్యాంక్‌లో ఎల్ఐసీ 9.99 శాతం వాటా స్వాధీనానికి ఆర్బీఐ అనుమతులు ఇచ్చింది. భారత స్టాక్ మార్కెట్లలో ఎల్ఐసి అతిపెద్ద ఇన్వెస్టర్‌గా ఉంది. అనేక ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంక్‌ల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఈ బీమా సంస్థకు 24 షెడ్యూల్డ్, వాణిజ్య బ్యాంక్‌ల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఐడీబీఐ బ్యాంక్‌లో ఏకంగా 49.24 శాతం వాటా ఉంది. కెనరా బ్యాంక్‌లో 8.8 శాతం, పీఎన్బీలో 8.3 శాతం, ఎస్బీఐలో 8.3 శాతం, యాక్సిస్ బ్యాంక్‌లో 8.2 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌లో 7.6 శాతం చొప్పున ఎల్ఐసీ వాటాలు కలిగి ఉంది.