Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పైలెట్ ప్రాజెక్టుగా అమీర్‌పేట, ఎల్బీ నగర్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్టలలో 32 ఆర్ జోన్స్ ఏర్పాటు
హైదరాబాద్: భారతదేశంలో అతిపెద్ద ఆన్లైన్ బస్ టికెటింగ్ సర్వీస్ అంటే గుర్తుకువచ్చేది రెడ్‌బస్. రెడ్‌బస్‌లో ప్రతీ ఒక్కరూ తమ ట్రావెల్‌ని బుక్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికే ఎంతోమంది ప్రయాణికులకు అద్భుతమైన సేవలు అందించిన రెడ్‌బస్ .. ఇప్పుడు మరో వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. ఆదే ఆర్ జోన్స్. దీన్ని ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో పైలెట్‌గా ప్రాజెక్టుగా ప్రారంభించింది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఆర్ జోన్ పేరుతో కొత్త డిజిటల్ బస్ బోర్డింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది. ఇది భౌతికంగా మనకు కన్పిస్తుంది. అలాగే రెడ్ బస్ యాప్‌లోనూ ఉంటుంది. దీనిద్వారా ప్రయాణికుడు తన ఖచ్చితమైన బస్ బోర్డింగ్ పాయింట్‌ను గుర్తించి, ఎలాంటి ఇబ్బంది మరియు ఆటంకాలు లేకుండా అక్కడ బస్ కోసం వెయిట్ చేయగలుగుతాడు. ప్రయాణీకులు బోర్డింగ్ స్పాట్‌ను సులభంగా గుర్తించడం కోసం ఆర్ జోన్ పైభాగంలో ఒక పెద్ద క్యూబ్ లాంటి నిర్మాణంతో పొడవైన స్తంభం ఉంటుంది. అంతేకాకుండా ఆ క్యూబ్‌పై ప్రత్యేకమైన కోడ్ మరియు రెడ్‌బస్ బ్రాండింగ్ ఉంటుంది. యాప్‌లో ఆర్ జోన్ కోడ్ అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం ఇతర వివరాలతో పాటు బస్సు టిక్కెట్‌పై కనిపిస్తుంది.
బస్‌లో ప్రయాణం అనేది నగరాల మధ్య ట్రావెల్ అత్యంత అనుకూలమైన మార్గం. ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళ్లేందుకు ఎక్కువమంది బస్నే ప్రిఫర్ చేస్తారు. అయితే బస్ బుక్ చేసుకున్న తర్వాత అది ఎక్కడికి వస్తుంది, ఎక్కడ ఆగుతుంది, ప్రయాణికులు ఎక్కడ ఎక్కాలి, అసలు బస్సు వచ్చిందా, ఇంకా రాలేదా లాంటి సందేహాలు ప్రయాణికులకు చాలా ఎక్కువగా ఉంటాయి. మెయిన్ పాయింట్స్ అయితే అందరూ గుర్తుపడతారు కానీ కొన్ని ప్రాంతాల్లో బస్ స్టాప్స్ని ప్రయాణికులు గుర్తించడం కష్టం అవుతుంది. దీనివల్ల ప్రయాణికులు ఒక్కోసారి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏదైనా కొత్త రూట్స్‌లో ప్రయాణించేవారు అయితే ఈ సమస్యలు ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఈ సమస్యలకు శాస్వత పరిష్కారంగా ఈ ఆర్ జోన్స్‌ని ఏర్పాటు చేసింది రెడ్‌బస్. ప్రయాణికుడు మరియు బస్సు సిబ్బంది ఇద్దరికీ ఉమ్మడి టచ్ పాయింట్‌ని సృష్టించడం ద్వారా ఆ జోన్స్ ఈ సమస్యల్ని తొలగిస్తాయి. రెడ్ బస్ యాప్ ద్వారా ప్రయాణికులు బోర్డింగ్ పాయింట్ అయితే ఆర్ జోన్ దగ్గరకు వెళ్తాడు. బస్సు సిబ్బందికి ప్రయాణీకుల పిక్-అప్ పాయింట్ తెలుసు కాబట్టి వాళ్లు అక్కడకి ఈజీగా వచ్చేస్తారు.
అంతేకాకుండా... ఈ ఆర్ జోన్స్‌లో ఇంకా అదనంగా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. తమ బస్సు యొక్క ఖచ్చితమైన స్థానాన్ని, అలాగే చేరుకునే అంచనా సమయాన్ని గుర్తించడానికి ప్రయాణికుల కోసం ఉచిత వై-ఫై సౌకర్యం ఉంటుంది. ఆర్ జోన్లో ప్రముఖంగా ప్రదర్శించబడే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా, ప్రయాణికులు తక్షణమే ఆన్లైన్లో బస్ టిక్కెట్లను సెర్చ్ చేసుకోవచ్చు మరియు బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు తమ బోర్డింగ్ పాయింట్లకు సులభంగా నావిగేట్ చేయడంలో సహాయపడటానికి మార్కర్ల ద్వారా అన్ని ఆర్ జోన్లు గూగుల్ మ్యాప్స్‌లో గుర్తించే ఉంటాయి.
పైలట్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌లో 32 ఆర్ జోన్లను ప్రారంభించింది రెడ్‌బస్. ఏప్రిల్, 2022 చివరి నాటికి 130కి పైగా ఆర్ జోన్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంది. హైదరాబాద్‌లో అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, ఎల్బీ నగర్ మరియు పంజాగుట్టలో ఆర్ జోన్స్ ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, హై-ఫై (హైదరాబాద్ సిటీ వైఫై ప్రాజెక్ట్ - తెలంగాణా ప్రభుత్వం ఇనిషియేటివ్)తో ఒప్పందం ద్వారా ఇవి ఏర్పాటు అవుతున్నాయి. అంతేకాకుండా బస్ ఇన్ఫోటైన్మెంట్ లక్ష్యంతో స్థాపించబడిన టి-హబ్ ఇంక్యుబేటెడ్ టెక్ కంపెనీ ఎయిర్ ఫై9తో కలిసి ఏర్పాటు చేయబడింది. ప్రయాణికులందరికీ పూర్తి స్థాయి వై-ఫై ఎనేబుల్ చేసిన ప్రయాణాన్ని అనుభవంలోకి తేవడమే దీని ముఖ్య ఉద్దేశం.
ఈ సందర్భంగా రెడ్‌బస్ సీఈఓ ప్రకాష్ సంగం మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.... "ప్రయాణికుల సౌకర్యం మరియు భద్రత అనే ఆలోచనల ద్వారానే రెడ్‌బస్ ఇంటర్సిటీ బస్సు రవాణా విభాగంలో అనేక సౌకర్యాలను ప్రారంభించింది. ఇప్పుడు ఆర్ జోన్ దీనికి కొనసాగింపు. ప్రజా రవాణా యొక్క అనుభవాన్ని సాంకేతికత అద్భుతంగా మార్చగలదు. ప్రత్యేకించి సరైన స్థలంలో మరియు సరైన సమయంలో ఇంటర్సిటీ బస్సుని ఎక్కడానికి ప్రయాణికులకు ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. అన్నింటికి మించి సురక్షితంగా మారుస్తుంది. అందుకు ఈ ఆర్ జోన్సే బలమైన ఉదాహరణ అని అన్నారు ఆయన.
బస్సు ఎక్కడ మిస్ అయిపోతుందో అని చాలామంది ప్రయాణికులు ఒత్తిడికి గురవుతారు. అందుకే ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు బోర్డింగ్ పాయింట్‌కి వెళ్లాలని మేము కోరుకుంటున్నాము. అలాంటి సమయంలో ఆర్ జోన్ అనేది ప్రయాణీకులకు మరియు బస్సు సిబ్బందికి ఒత్తిడి లేని బోర్డింగ్ అనుభవం కోసం ఒక ఉమ్మడి పాయింట్లో కలుస్తుంది. ఈ కాన్సెప్ట్‌ను విజయవంతం చేయడంలో మా భాగస్వామి బస్సు ఆపరేటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప్రయత్నంలో మద్దతు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వం & గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. త్వరలో హైదరాబాద్ అంతటా ఆర్ జోన్ ప్రాజెక్ట్‌ను విస్తరించడానికి ఎదురుచూస్తున్నాము.