Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతుల శ్రేయస్సు కోసం జిల్లా వారీగా పంట ప్రణాళికను రూపొందించేందుకు తెలంగాణా ప్రభుత్వం, పౌర సమాజానికి మద్దతునందించనుంది.
నిర్ణీత గడువు లోగా శాస్త్రవేత్తలు,సాంకేతిక నిపుణులు మరియు సరుకు నిపుణులతో కలిసి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ప్రణాళికను రూపొందించనుంది.
వ్యవసాయ ఉత్పత్తులను(మిరప, పసుపు మొదలైనవి) నేరుగా రైతుల నుంచి ఎగుమతి చేసేందుకు పౌర సమాజం తగిన అవకాశాలను కల్పించనుంది
తెలంగాణా రాష్ట్ర ప్రణాళిక బోర్డ్ వైస్ చైర్మెన్ బీ వినోద్ కుమార్
హైదరాబాద్ : శాస్త్రీయ పద్ధతిలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విస్తృతశ్రేణిలో పంటల వైవిధ్యీకరణ కార్యక్రమాలను పరిచయం చేయనుందని తెలంగాణా రాష్ట్ర ప్రణాళిక బోర్డ్ వైస్ చైర్మెన్ బీ వినోద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో రైతుల ఆదాయం వృద్ధి చేయడంతో పాటుగా తమ పంటను ఎగుమతి చేయడంలోనూ సహాయపడనుందన్నారు. రైతులతో పాటుగా రైతు సమాజ ప్రయోజనార్థం, ఇది పౌర సమాజానికి మద్దతునందించడంతో పాటుగా జిల్లాల వారీగా పంట ప్రణాళికనూ రూపొందించనుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు శాస్త్రీయ సమాజాన్ని , వ్యవసాయ రంగ నిపుణులను ఈ కార్యక్రమానికి తగిన ప్రణాళికను సూచించాల్సిందిగా కోరిందని, తద్వారా రైతులకు మరింత ప్రయోజనం కలిగించేందుకు ప్రభుత్వం మద్దతునందిస్తుందని అన్నారు.
ఆయన మాట్లాడుతూ.. ఈ విధానం అమలులోకి వచ్చిన తరువాత, ఈ పంటల వైవిధ్యీకరణ కార్యక్రమంతో రైతులకు ఆర్థిక కష్టాలు తొలగిపోవడంతో పాటుగా పంట దిగుబడులు కూడా పెరుగుతాయన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను ఉత్పత్తి చేయడం వల్ల వారి ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని ఆయన వెల్లడించారు. ఇటీవల నగరంలోని ఓ హోటల్లో 'ప్రజాస్వామికంగా అంతర్జాతీయ విలువ చైన్ రూపొందించడానికి అంతరాలను పూరించడం.. తెలంగాణాలో వ్యవసాయ వస్తువుల ఎగుమతి సంభావ్యత` శీర్షికన జరిగిన జాతీయ వర్క్‌షాప్‌లో పాల్గొన్న వారు ఈ అంశాలను వెల్లడించారు. ఈ వర్క్‌షాప్‌ను తెలంగాణా రాష్ట్ర ప్రణాళిక బోర్డ్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, కాన్ఫిడరేషన్ ఆఫ్ ఎన్జీఓ ఆఫ్ రూరల్ ఇండియా (సీఎన్ఆర్ఐ) సంయుక్తంగా నిర్వహించగా, ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ మద్దతునందించింది.
ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ దేవి ప్రసాద్ మాట్లాడుతూ 'కష్టించే రైతులు మరియు తెలంగాణా రాష్ట్ర రైతాంగ వ్యవస్ధ ప్రయోజనాల కోసం ఒక రకమైన నియంత్రిత వ్యవసాయ విధానం అవసరం. అత్యవసరంగా శాస్త్రవేత్తలు, టెక్నోక్రాట్స్, కమోడిటీ నిపుణులతో చర్చించి దీనికి సంబంధించి ఓ ప్రణాళికను తీసుకురావాల్సి ఉంటుంది.` అని అన్నారు.
నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కారణంగా రైతులు నష్టపోతున్నారని, అత్యుత్తమ ఇన్పుట్స్, ట్రేసబిలిటీతో ఈ నష్టాలను తగ్గించవచ్చని ధనుకా గ్రూప్ ఛైర్మన్ ఆర్.జి. అగర్వాల్ అన్నారు.