Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి 36శాతం మెజారిటీ వాటా ప్రకటించిన వొడాఫోన్ ఐడియా
న్యూఢిల్లీ : దేశంలోనే మూడో అతిపెద్ద టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా (విఐ) ప్రభుత్వ గూటికి చేరింది. ఈ కంపెనీలోని ప్రధాన వాటాను కేంద్రానికి అప్పగిస్తూ ఆ కంపెనీ నిర్ణయం తీసుకుంది. కంపెనీ బకాయిలను ఈక్విటీగా మార్చిన తర్వాత విఐలో 35.8 శాతం వాటా ప్రభుత్వానికి దక్కింది. సోమవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ వాటాకు అంగీకారం తెలిపినట్లు విఐ మంగళవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. విఐలో ప్రస్తుతం బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్ గ్రూపు పబ్లిక్ లిమిటెడ్‌కు 28.5 శాతం, కుమార్ మంగళం బిర్లా ఆధ్వర్యంలోని ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు 17.8 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. రూ.10 ముఖ విలువతో ఈ ఈక్విటీ వాటాను కేంద్రానికి కేటాయించింది. తాజా ప్రకటనలో భారత ప్రభుత్వం మెజారిటీ వాటాను పొందినట్లయ్యింది. టెలికం పరిశ్రమలో పెద్ద పెద్ద లాభదాయక పరిస్థితులు కనబడకపోవడం, తాము వినియోగదారులను భారీగా కోల్పోతున్న తరుణంలో తమ నిర్ణయంలో తప్పు లేదని విఐ పేర్కొంది. టెలికం కంపెనీలు చెల్లించాల్సిన ఎజిఆర్ బకాయిలకు నాలుగేళ్ల మారటోరియం కల్పించినప్పటికీ విఐ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. గతేడాది సెప్టెంబర్ ముగింపు నాటికి విఐ రూ.1.94 లక్షల కోట్ల అప్పులో ఉంది. ఇందులో రూ.1.08 లక్షల కోట్ల స్పెక్ట్రం బకాయిలు, రూ.63,400 ఎజిఆర్ బకాయిలు, బ్యాంక్‌లకు రూ.22,770 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంది. తాజా నిర్ణయంతో మంగళవారం బిఎస్ఇలో విఐ షేర్ 20.54 శాతం క్షీణించి రూ.11.80 వద్ద ముగిసింది.