Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్ళీ చైనా ప్రాదేశిక జలాల్లోకి అమెరికా యుద్ధ నౌక
- తీవ్రమైన కవ్వింపు చర్య అంటూ చైనా ఆగ్రహం
బీజింగ్ : ఎవరెన్ని చెప్పినా అమెరికా తన సహజ ధోరణి అయిన కవ్వింపు చర్యలను, దూకుడు వైఖరిని మానదు. ప్రత్యేకించి చైనాపై అంటే మూడుకాళ్ళతో దుముకుతుంది. తాజాగా చైనా ప్రాదేశిక జలాల్లోకి అమెరికా యుద్ధ నౌక ప్రవేశించింది. ఇది తీవ్రమైన కవ్వింపు చర్య అంటూ చైనా సైనిక ప్రతినిధి గురువారం వ్యాఖ్యానించారు. చైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే దక్షిణ చైనా సముద్రంలోని జిషా దీవి జలాల్లోకి అమెరికా క్షిపణి విధ్వంసక నౌక యుఎస్ఎస్ బెన్ఫోల్డ్ ప్రవేశించింది. చైనా జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వూ కియాన్ మాట్లాడుతూ, అమెరికా చెబుతున్నట్లుగా ఇదేమీ స్వేచ్ఛగా నౌకలు రాకపోకలు జరిపే మార్గం కాదు. చైనా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే చర్య, దక్షిణ చైనా సముద్రంలోని శాంతి సుస్థిరతలను దెబ్బతీసే చర్య అని పేర్కొన్నారు. అమెరికా యుద్ధనౌకను పర్యవేక్షించి, హెచ్చరికలు జారీ చేసేందుకు చైనా ఆర్మీ వైమానిక, నావికాబలగాలను పంపిందని చెప్పారు. అమెరికా చర్యను చైనా సైన్యం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. చైనా ప్రాదేశిక జలాల్లో అమెరికా మిలటరీ యుద్ధ నౌకల ఆధిపత్య ధోరణులను ఎంత మాత్రమూ సహించేది లేదని వూ తేల్చి చెప్పారు. పరిస్థితిని సరిగా అర్ధం చేసుకుని, ఇటువంటి కవ్వింపు చర్యలు మానాలని అమెరికాను చైనా కోరింది. ఎలాంటి బెదిరింపులు, లేదా కవ్వింపు చర్యలనైనా ఎదుర్కొనేందుకు చైనా సైన్యం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని వూ స్పష్టం చేశారు. చైనాసార్వభౌమాధికారాన్ని కచ్చితంగా కాపాడుకుంటుందని, ప్రాంతీయ శాంతి భద్రతలు, సుస్థిరతను పరిరక్షించుకుంటుందని చెప్పారు.