Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్ఐసీలో వాటాల విక్రయం... ప్రజా వ్యతిరేకం
- నిపుణుల ఆందోళన
- ఫిబ్రవరిలో రెండు రోజుల సమ్మెకు కసరత్తు
నవతెలంగాణ- బిజినెస్ బ్యూరో
ప్రజల ఆసక్తులకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ)లో వాటాల విక్రయం జరుగుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం పీపుల్స్ కమిషన్ ఆన్ పబ్లిక్ సెక్టార్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ నిర్వహించిన వర్చ్యూవల్ మీడియా సమావేశంలో పలువురు నిపుణులు మాట్లాడుతూ ఎల్ఐసీ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం సంస్థను విలువ కట్టే ప్రక్రియలో గుడ్‌విల్, ఏజెంట్ల కృషి తదితర అనేక అంశాలను ప్రభుత్వం విస్మరించిందని తెలిపారు. పీఎస్‌యూల్లో వాటాలను విక్రయిం చడమంటే సామాజిక బాధ్యతలను తగ్గించుకోవడమేనన్నారు. ఆరు దశాబ్దాల క్రితం రూ.5 కోట్ల మూలధనంతో ప్రారంభమైన ఎల్ఐసీ ప్రస్తుతం 40 కోట్ల మంది పాలసీదారులతో రూ.4 లక్షల కోట్ల ప్రీమియాన్ని నమోదు చేయడంతో పాటుగా రూ.38 లక్షల కోట్ల ఆస్తులను కలిగి ఉందన్నారు. ఎల్ఐసీలో పాలసీదారుల పొదుపునకు ఇప్పటి వరకు ఎలాంటి ఢోకా లేదని విద్యుత్, ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ ఇఎఎస్ శర్మ పేర్కొన్నారు. వాటాదారులకు బోనస్ చెల్లించడంలో సంస్థ ఎప్పుడూ కూడా విఫలం కాలేదన్నారు. మొత్తం మిగులు నిధుల్లో 95శాతం పాలసీదారులకు చెల్లిస్తుం దన్నారు. స్టాక్ మార్కెట్లలో అతిపెద్ద ఇన్వెస్టర్‌గా ఎల్ఐసీ ఉంద న్నారు. పేద, మధ్య తరగతి వారికి కూడా చిన్న పాలసీలను అందుబాటులో ఉంచుతుందన్నారు. ప్రయివేటు బీమా కంపెనీలు ఇప్పటికీ ఆ పని చేయడం లేదన్నారు. సామాజిక బాధ్యత కలిగిన ఎల్ఐసీలో కేంద్రం 10 శాతం వాటాలను మార్కెట్ శక్తులకు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసిం దన్నారు. దీని ద్వారా సామాజిక భద్రత, పాలసీదారులకు రక్షణ తగ్గొచ్చన్నారు. క్రమంగా ఎల్ఐసీని పూర్తిగా ప్రయివేటుపరం చేసే అవకాశం లేకపోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
విలువ కట్టడంలో లోపాలు : సీనియర్ జర్నలిస్టు వి శ్రీధర్
గత బడ్జెట్లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఎల్ఐసీ లో డిజిన్వెస్ట్‌మెంట్ చేయనున్నట్లు ఏక వ్యాఖ్య ప్రకటన చేశారని సీనియర్ జర్నలిస్టు వి శ్రీధర్ గుర్తు చేశారు. వచ్చే నెల ఫిబ్రవరిలోనే ఇందులో వాటాల విక్రయం జరుగొచ్చని పేర్కొన్నారు. ఇది దేశం లోని బీమా పాలసీదారులు, ఏజెంట్లకు ఆసక్తులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయ మన్నారు. ఎల్ఐసీలో వాటాల విక్రయాన్ని అనేక మంది వ్యతిరేకిస్తున్నారన్నారు. గత 20 ఏండ్ల నుంచి ప్రభుత్వాల చేపడుతున్న పీఎస్‌యూల ప్రయివేటీకరణ, డిజిన్వెస్ట్‌మెంట్ వివాదస్పదంగానే ఉందన్నారు. సంస్థలను విలువ కట్టడంలో అనేక లోపాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఎల్ఐసీ పాలసీ సగటు టికెట్ విలువ రూ.16,000గా ఉంటే.. ప్రయివేటు రంగంలోని బీమా పాలసీల టికెట్ విలువ రూ.90వేలుగా ఉందన్నారు. దీంతో సాధారణ ప్రజల పెట్టుబడులు ఎందులో ఎక్కువగా ఉన్నాయే స్పష్టమవుతుందన్నారు.
23, 24న సమ్మె : అమానుల్లా ఖాన్
ఎల్ఐసీ ఐపీఓ, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రయివేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 23, 24 తేదిల్లో సమ్మెకు వెళ్తున్నామని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఎఐఐఈఏ) మాజీ ప్రెసిడెంట్ అమానుల్లా ఖాన్ తెలిపారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఎల్ఐసీ ప్రతీ ఏడాది 12 శాతం వృద్థిని సాధిస్తుందన్నారు. ఎల్ఐసీ ఐపీఓలో 13 లక్షల మంది ఏజెంట్ల విలువను పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. '' ప్రజల సొమ్ము ప్రజల సంక్షేమం కోసం'' అనే నినాధంతో ఇప్పటి వరకు ఎల్ఐసీ పని చేస్తుందన్నారు. ఐపీఓ తర్వాత ఈ విధానం మారిపోనుందన్నారు.
కార్పొరేట్ల ఆసక్తులకు ప్రాధాన్యత : రిటైర్డ్ ప్రొఫెసర్ దినేష్ అబ్రోల్
కార్పొరేట్ శక్తుల ఆసక్తులను కాపాడటంతో కేంద్రం నిమగమై ఉందని నేషనల్ ఇన్స్ట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నలాజీ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ రిటైర్డ్ ప్రొఫెసర్ దినేష్ అబ్రోల్ విమర్శించారు. పిఎస్‌యులను ఓ వైపు ప్రయివేటీకరిస్తూ మరోవైపు వొడాఫోన్ ఐడియాలో కేంద్రం పెట్టుబడులు పెడుతూ ఆదిత్యా బిర్లాకు సహాయం చేస్తోందన్నారు. ఈ విధానంతో ప్రభుత్వం ఎవరి ఆసక్తులను కాపాడుతుందో స్పష్టమవుతుందని విమర్శించారు. ఈ వర్చ్యూవల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫిడిరేషన్ అండ్ పీపుల్ ఫస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ థామస్ ప్రాంకో నిర్వహించారు.