Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తీవ్రమైన కామెర్లు మరియు రెండు వారాలుగా కోమాలో ఉన్న ఓ మహిళకు సవాల్‌తో కూడిన అత్యవసర కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను పేస్ హాస్పిటల్స్ బృందం విజయవంతంగా చేసింది. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. ఆరు నెలల కిత్రం ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఓ మాతృమూర్తి అక్యూట్ హెప్టిక్ ఫెయిల్యూర్ (తీవ్రమైన కాలేయ సంబంధిత వైఫల్యం) కామెర్లతో నెల రోజులుగా బాధపడుతున్నారు. తొలుత అనారోగ్యంగా ఉండటంతో పాటుగా వైరల్ హెపటైటిస్ కూడా రావడంతో ఆమె స్ధానికంగా 10 రోజుల పాటు మందులు వాడారు. ఇదే ఆమె ప్రాణాపాయంలో పడటానికి కారణమైంది. స్ధానికంగా మందులను తీసుకోవడంతో ఆమె వైద్య పరిస్థితి మరింత దిగజారింది. కామెర్లు మరింతగా ముదిరిపోయాయి. ఇది ఏకంగా 30ఎంజీ శాతానికి చేరింది. కామెర్లు తీవ్రం కావడంతో ఆమె కోమాలోకి చేరిపోవడంతో పాటుగా తరచుగా మూర్చ రావడం జరిగింది. దీనితో ఆమెను వెంటిలేటర్‌పై పెట్టారు. ఆమె కాలేయం విఫలం కావడంతో పాటుగా ఆమె రక్తంలో ప్లేట్లెట్లు కూడా పడిపోయాయి మరియు రక్తం గడ్డకట్టడంలో కూడా సమస్యలను ఎదుర్కొంటుంది. ఇలాంటి స్ధితిలో ఆమెను పేస్ హాస్పిటల్‌కు అత్యవసరంగా కాలేయ మార్పిడి కోసం తీసుకువచ్చారు.
ఇది అత్యంత క్లిష్టమైన మరియు సవాల్‌తో కూడిన స్థితి. తీవ్రమైన కాలేయ వైఫల్యంతో పాటుగా ఇన్ఫెక్షన్, మూర్ఛ సమస్య కూడా ఆమెకు ఉంది. గ్రేడ్ 4 కోమాలో ఉండటంతో పాటుగా అత్యధిక బైలిరుబిన్ కూడా కలిగి ఉన్నారు. నిమిషం నిమిషానికి ఆమె పరిస్థితి మారిపోవచ్చు మరియు కాలేయ మార్పిడి తరువాత కూడా మృత్యువాత పడేందుకు 50 శాతానికి పైగా అవకాశాలున్నాయని అని డాక్టర్ గోవింద్ వర్మ, చీఫ్ హెపటాలజిస్ట్ అన్నారు. ఆయనే మాట్లాడుతూ 'ఈ రోగిని జీవన్‌దాన్‌లో సూపర్ అర్జెంట్ విభాగంలో నమోదు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆమెకు మ్యాచ్ అయ్యే కాలేయం లభ్యం కాలేదు. రోగి పరిస్థితి మరింతగా దిగజారుతుండటంతో జీవించి ఉన్న వ్యక్తి కాలేయ మార్పిడి చేయాలని నిర్ణయించాము` అని అన్నారు.
ట్రాన్స్‌ప్లాంట్ అనస్థీషియస్ట్ డాక్టర్ మంజునాథ్ మాట్లాడుతూ.. 'తీవ్రమైన కాలేయ వైఫల్య కేసులలో అతి పెద్ద సవాల్‌గా మారే అంశమేమిటంటే, రోగి పరిశీలన, రోగిని సిద్ధం చేయడం వంటి అంశాలన్నీ చాలా వేగంగా జరగాలి. మార్పిడికి ముందు గోల్డెన్ హవర్స్ అత్యంత కీలకం. రోగి మెదడులో రక్తస్రావం లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా అకస్మాత్తుగా వారు మృత్యువుకు చేరువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి` అని అన్నారు.
ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఫణి కృష్ణ మాట్లాడుతూ.. 'శస్త్రచికిత్సకు మునుపు ఆమె బైల్బురిన్ చాలా అధికంగా ఉంది. మా హెపటాలజీ బృందం అత్యవరంగా లివర్ డయాలసిస్ చేసింది. ప్లాస్మా మార్పిడి చేయడం ద్వారా బైలిరుబిన్‌ను 30నుంచి 15కు తీసుకువచ్చారు. అలాగే మెదడు వాపును సైతం తగ్గించారు. శ్వాస సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్, తీవ్రమైన కోమా వంటి సమస్యలు ఉన్నప్పటికీ అనుక్షణం డాక్టర్లు ఆమెను గమనిస్తూ తగిన చికిత్సనందించడంతో ఆమె శస్త్రచికిత్స నందించేందుకు అవసరమైన వైద్య స్థితికి చేరుకోగలిగారు` అని అన్నారు.
ఆమె కామెర్లు, మెదడు వాపు నియంత్రించడంతో పాటుగా ఇన్ఫెక్షన్ను సైతం నియంత్రించిన తరువాత ఆమెకు అత్యవసరంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను పది మంది డాక్టర్లతో కూడిన ట్రాన్స్ ప్లాంట్ బృందం చేసింది. ఈ బృందంలో డాక్టర్ మధుసూదన్, డాక్టర్ ఫణి కృష్ణ, డాక్టర్ మంజునాథ్, డాక్టర్ గోవింద్ వర్మ ఉన్నారు. ఈ రోగి సోదరుడు ఆమెకు తన కాలేయం దానం చేశారు. అతని కాలేయంలో కుడివైపు భాగాన్ని ఆమెకు మార్పిడి చేశారు. అత్యంత సవాల్‌తో కూడిన పరిస్థితులు ఎదురైనప్పటికీ శస్త్ర చికిత్స సజావుగా సాగడంతో పాటుగా శస్త్ర చికిత్స అనంతరం ఆమె కోలుకోగలిగారు. శస్త్ర చికిత్స జరిగిన 12 గంటలలోనే నాటకీయంగా ఆమె కోమా నుంచి పూర్తిగా బయటపడగలిగారు. ఆమె కామెర్లు ఏడు రోజుల్లో తగ్గాయి. శస్త్రచికిత్స అయిన 10 రోజుల తరువాత ఆమె డిశ్చార్జ్ అయ్యేందుకు తగిన ఫిట్నెస్ సాధించగలిగారు.
ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ.. 'కాలేయ మార్పిడి శస్త్రచికిత్స సమయంలో ఆమెకున్న ఆరోగ్య స్థితిని బట్టి మార్పిడి సజావుగా సాగినప్పటికీ ఈ రోగి కోలుకోవడం అంత త్వరగా వీలుకాకపోవచ్చని భావించాము. కానీ అద్భుతంగా ఆమె అత్యంత వేగంగా కోలుకున్నారు. మరీ ముఖ్యంగా రెండు వారాలు పూర్తిగా కోమాలో ఉండి కోలుకోవడం, శస్త్ర చికిత్స అయిన ఆరు గంటలలోనే ఆమె స్పృహలోకి రావడం మాకు చాలా ఆనందం కలిగించింది` అని అన్నారు.
రోగి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. 'తీవ్రమైన కామెర్లతో బాధపడుతున్న ఆమె రెండు వారాల పాటు కోమాలో వెంటిలేటర్‌పై ఉండటం చేత దాదాపుగా ఆశలు వదులుకున్నాం. ఆమెపై ఆమె 6 నెలల శిశువు ఆధారపడి ఉంది. పేస్ హాస్పిటల్స్‌కు మేము హృదయపూర్వక ధన్యవాదములు చెబుతున్నాము. వేగవంతంగా వారు తీసుకున్న చర్యల కారణంగా ఆమె పునర్జన్మ పొందారు. ఇది అద్భుతం. భగవంతుని ఆశీర్వాదం` అని అన్నారు.
డాక్టర్ గోవింద్ వర్మ మాట్లాడుతూ.. 'పేస్ వద్ద అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు ఆరంభించిన తరువాత గత ఆరు నెలల కాలంలో పన్నెండుకు పైగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేసినప్పటికీ ఈ తీవ్రమైన కాలేయ వైఫల్య కేసు మాత్రం మా లివర్ ఐసీయు, హెపటాలజీ, ట్రాన్స్‌ప్లాంట్ టీమ్ యొక్క సమ్మిళిత ప్రయత్నాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇప్పుడు వీరు మరింత సవాల్‌తో కూడిన కేసులను సైతం ఎదుర్కొవడానికి అవసరమైన మానసిక స్థైర్యం పొందారు మరియు పేస్‌ను కాలేయ మార్పిడికి అత్యున్నత కేంద్రంగానూ తీర్చిదిద్దగలరు` అని అన్నారు.
ట్రాన్స్‌ప్లాంట్ హెపటాలజిస్ట్ డాక్టర్ ధీరజ్ మాట్లాడుతూ.. 'కామెర్లు వచ్చినప్పుడు అనవసరంగా స్థానికంగా లభించే మందులను వాడకూడదనే హెచ్చరికను ఈ రోగి యొక్క కేసు మరింత ప్రస్ఫుటంగా వెల్లడిస్తుంది. చాలా వరకూ వైరల్ హెపటైటిస్ సమస్యలు ఎలాంటి సమస్యలు లేకుండా నయమవుతాయి. అయితే భయపడి ప్రత్యామ్నాయమార్గాలను అనుసరించే వారిలో ఒక్కోసారి పరిస్థితి దిగజారవచ్చు. మరీ ముఖ్యంగా కామెర్లతో బాధపడుతున్న రోగులలో ఈ సమస్య మరింత అధికంగా ఉంటుంది. ఇది కాలేయ నష్టాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. ఈ స్థితిని డిలి (డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ ఇంజురీ)గా వ్యవహరిస్తుంటాం. లివర్ ఐసీయు రోగులలో చేరికలు మరియు మరణాలకు అతి సహజమైన కారణంగా ఇది నిలుస్తుంది` అని తెలిపారు.