Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దలాల్ స్ట్రీట్లో నష్టాల బాట
- మూడుసెషన్లు..7లక్షల కోట్ల సంపద ఆవిరి
- సెన్సెక్స్ 1,024 పాయింట్ల పతనం
ముంబయి : ఇటీవల వరుస నష్టాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్లలో మరో కుదుపు చోటు చేసుకుంది. విదేశీ సంస్థాగత మదుపర్లు తమ ఈక్విటీలను తరలించుపోవడం, దేశంలో ద్రవ్యోల్బణం పెరగడం, ఆర్బీఐ ద్రవ్య పరపతిని మరింత కఠినతరం చేయనుందన్న అంచనాలతో సోమవారం సెషన్లో దలాల్ స్ట్రీట్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. బీఎస్ఈ సెన్సెక్స్ ఓ దశలో 1,346 పాయింట్లు పతనమయ్యింది. తుదకు 1024 పాయింట్లు లేదా 1.75 శాతం క్షీణించి 57,621కి దిగ జారింది. ఒక్క పూటలో మదుపర్లు రూ.2.9 లక్షల కోట్ల సంపదను పోగొట్టుకోగా.. గడిచిన మూడు సెషన్లలో రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది.సెన్సెక్స్-30లో ఎల్అండ్టీ అత్యధికంగా 3.6 శాతం నష్టపోగా.. ఇదే బాటలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, హెచ్డీఎఫ్సీ ఫిన్సర్వ్, కొటాక్ బ్యాంక్, టైటన్ తదితర షేర్లు అధికంగా విలువ కోల్పోయాయి. తొలి 30 సూచీల్లో పవర్ గ్రిడ్, టాటా స్టీల్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ తదితర ఐదు స్టాక్స్ మాత్రమే లాభపడ్డాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుతో ఎఫ్ఐఐలు తరలిపోవడం మార్కెట్లపై ఒత్తిడిని పెంచాయని నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు చమురు ధరల పెరుగుదల మదుపర్లను ఆందోళనకు గురి చేస్తుందన్నారు. ఐటీ రంగ షేర్లు దిద్దుబాటుకు గురైయ్యాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.3 శాతం, 0.8 శాతం చొప్పున తగ్గాయి. నిఫ్టీలో పీఎస్బీ మినహా మిగితా రంగాలన్నీ ప్రతికూలతను ఎదుర్కొన్నాయి.