Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఉద్యోగాలను సృష్టిస్తున్న అంబానీ, ఆదానీ వంటి పారిశ్రామికవేత్తలను పూజించాలని బీజేపీ ఎంపీ కెజె అల్ఫోన్స్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానాలు ఆదాయ అసమానతలను పెంచుతున్నాయని ప్రతిపక్షాలు వాదిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవికత లేని, ఉద్యోగరహిత వృద్ధిని గురించి మోడీ ప్రభుత్వం వ్యాఖ్యానిస్తోందంటూ మండిపడ్డాయి. గురువారం రాజ్యసభలో బడ్జెట్ పై అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరుగుతుండగా అల్ఫోన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడిదారుల ప్రతినిధినని తనను ప్రతిపక్షాలు నిందించినప్పటికీ.. ఈ దేశంలో ఉద్యోగాలను సృష్టించేవారిని గౌరవించాలని అన్నారు. వారి పేర్లను ప్రతిపక్షాలు చెప్తున్నాయని.. అందుకే తాను ప్రస్తావిస్తున్నానంటూ.. రిలయన్స్, అంబానీ కానీ, అదానీ కానీ ఎవరైనా సరే, వారిని మనం పూజించాలని అన్నారు. వారు పెట్టుబడులు పెట్టి దేశంలో నగదుని సృష్టిస్తున్నారని, ఉద్యోగాలు కల్పిస్తున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అసమానతలు ఉండటం వాస్తవమని చెప్పారు. ఇద్దరి సంపద పెరిగిందని ప్రతిపక్షాలు అంటున్నాయని, అయితే ఎలన్ మస్క్ సంపద 1,016 శాతం పెరగలేదా .. ఈ విషయం మీకు తెలియదా అని ప్రతిపక్షాలను నిలదీశారు. మీరు అంగీకరించినా లేకపోయినా గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్ సంపద 126 శాతం, బెజోస్ సంపద 67 శాతం, బిల్ గేట్స్ సంపద 30 శాతం పెరిగాయని అన్నారు. రోజుకు 5 డాలర్ల కన్నా తక్కువ సంపాదిస్తున్నవారు ప్రపంచంలో 300 కోట్ల మంది ఉన్నారన్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరం కోసం నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా స్పందించారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వ పని తీరును తాను గమనిస్తున్నాననీ, ఎవరికి అమృతం దక్కుతోందో, ఎవరికి విషం అందుతోందో స్పష్టంగా తెలుస్తోందన్నారు. ప్రధాని స్నేహితులకు అమృతం, దేశ ప్రజలకు విషం అందుతున్నాయన్నారు.