Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 1747 పాయింట్ల పతనం
- రూ.8.5 లక్షల కోట్ల సంపద ఫట్
ముంబయి : ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ మార్కెట్లను కుదేలు చేసింది. అమెరికా రెచ్చగొట్టడానికి తోడు ఇరు దేశాల మధ్య పరిస్థితులు చేజారిపోవచ్చనే మదుపర్ల ఆందోళనలతో సోమవారం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయి. దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాలను కొనసాగించారు. ఈ నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీలు 3 శాతం చొప్పున పతనమయ్యాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో ఏకంగా 1857 పాయింట్లు పతనం కాగా.. తుదకు 1,747 పాయింట్లు క్షీణించి 56,406కు పడిపోయింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 532 పాయింట్ల నష్టంతో 16,843 వద్ద ముగిసింది.
2021 నవంబర్ 26తో ఇంట్రాడేలో అత్యధిక పతనం ఇదే కావడం గమనార్హం. ఒక్క పూటలోనే మదుపర్ల సంపద రూ.8.5 లక్షల కోట్లు కరిగిపోయింది. శుక్రవారం సెషన్లో బిఎస్ఇలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ రూ.263.89 లక్షల కోట్లుగా ఉండగా.. ఇది రూ.255.38 లక్షల కోట్లకు క్షీణించింది. 2022లో ఇదే అత్యధిక గరిష్ఠ పతనం.
బ్యాంక్ షేర్లకు ఏబీజీ దెబ్బ..
సెన్సెక్స్-30లో టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ సూచీలు అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. ఒక్క టీసీఎస్ మాత్రమే లాభపడింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా3.5శాతం,4శాతం చొప్పున నేల చూపులు చూశాయి. గుజరాత్ కేంద్రంగా పని చేస్తున్న ఏబీజీ షిప్‌యార్డ్ యాజమాన్యం బ్యాంకులను మోసగించి న విషయం బయటికి రావడంతో బ్యాంక్ సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన ా్నయి.నిఫ్టీలో బ్యాంకింగ్ రంగం 5 శాతం మేర విలువ కోల్పోయింది. జోమాటో, నైకా,పేటియం తదితర12 సూచీలు ఆల్‌టైం కనిష్టానికి పడిపోయాయి.
ప్రపంచ మార్కెట్ల దిగాలు..
అంతర్జాతీయంగా ఫ్రాంక్ఫర్ట్, పారిస్ స్టాక్ మార్కెట్లు మూడు శాతానికి పైగా విలువ కోల్పోయాయి. లండన్ రెండు శాతం, టోక్యో 2.2 శాతం చొప్పున నష్టపోయాయి. షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. అమెరికన్లు 48 గంటల్లో ఉక్రెయిన్ను వీడాలని వైట్‌హౌస్ ఆదేశించడంతో వాల్ స్ట్రీట్ బెంచ్‌మార్క్ ఎస్ అండ్ పి సూచీ శుక్రవారం 1.9 శాతం నష్టపోయింది.
అప్రమత్తం..
రష్యా, ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న ఆందోళనల పరిస్థితుల నేపథ్యంలో రిటైల్ మదుపర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లలో పెట్టుబడులపై అచీతూచీ వ్యవహారించాలని హెచ్చరిస్తున్నారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో పరిస్థితులు క్లిష్టంగా మారే అవకాశం ఉందన్నారు. యుద్ధమే జరిగితే చమురు, గ్యాస్ ధరలు అమాంతం పెరగొచ్చని, ప్రపంచ మార్కెట్ల పతనం ఊహించని స్థాయికి క్షీణించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.