Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో పాలసీదారులకు సంబంధించిన క్లెయిమ్ చేసుకోని రూ.21,539 కోట్ల నిధులున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. 2021 సెప్టెంబర్ ముగింపు నాటికి ఎవరూ క్లెయిం చేయని ఈ మొత్తం వడ్డీతో కలిపి తమ వద్ద ఉందని ఎల్ఐసీ తన ఐపీఓ ప్రతిపాదిత దస్త్రాల్లో సెబీకి తెలిపింది. ఆ వివరాలు.. 2021 మార్చి ముగింపు నాటికి ఇది రూ.18,495 కోట్లుగా, 2020 మార్చి ముగింపు నాటికి రూ.16,052.65 కోట్లుగా ఉంది. మార్చి 2019 చివరి నాటికి ఈ మొత్తం రూ.13,843.70 కోట్లుగా పోగయ్యింది. క్లెయిమ్ చేయని రూ.1000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తాలను బీమా సంస్థలు తమ వెబ్సైట్లలో పొందుపర్చాలని సెబీ నిబంధనల్లో ఉంది. పదేండ్లు దాటినా ఆ వివరాలను అలాగే ఉంచాలి. వీటికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు పాలసీదారులు లేదా లబ్దిదారులకు వీలు కల్పించాలి.
పెట్టుబడులపై ఆంక్షలు..
ఎల్ఐసీ పలు పెట్టుబడులపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏఐ) పలు ఆంక్షలు పెట్టింది. సంస్థ ఐపిఒకు వెళ్తున్న నేపథ్యంలో ఇకపై పెన్షన్ ఫండ్స్, లైఫ్ గ్రూప్ యాన్యుటీ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి వీలు లేదని తెలిపింది. ఇప్పటి వరకు పెన్షన్, గ్రూప్ అండ్ లైఫ్ యాన్యుటీ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడులను 2023 జనవరి ముగింపు నాటికి పూర్తిగా ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. వాటాదారుల పెట్టుబడులను వారికి బదిలీ చేయడానికి మరింత సమయం ఇచ్చేందుకూ నిరాకరించింది. తదుపరి గడువు పొడిగించే ప్రసక్తి లేదని ఐఆర్డీఏఐ పేర్కొంది.