Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ నష్టాల్లో సూచీలు
- ఇంట్రాడేలో సెన్సెక్స్ 1300 పాయింట్లు ఫట్
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లలో ఉక్రెయిన్ భయాలు కొనసాగుతున్నాయి. ఉదయం భారీ పతనంతో ప్రారంభమై మదుపర్లను బెంబేలెత్తించాయి. మంగళవారం బిఎస్ఇ సెన్సెక్స్ ఉదయం 1300 పాయింట్ల నష్టంతో ప్రారంభమై.. చివరి గంటలో కొంత పుంజుకున్నప్పటికీ తుదకు 383 పాయింట్లు లేదా 0.6 శాతం క్షీణించి 57,300కి పడిపోయింది. ఇదే బాటలో ఎన్ఎస్ఇ నిఫ్టీ ఇంట్రాడేలో 248 పాయింట్లు కోల్పోగా.. తుదకు 114 పాయింట్ల పతనంతో 17,092 వద్ద ముగిసింది. ఉక్రెయిన్ కేంద్రంగా నాటో, రష్యాల మధ్య నెలకొన్న వివాదం మరింత తీవ్రమైంది. దీని ప్రభావం నేరుగా స్టాక్ మార్కెట్లపై పడింది. ఉక్రెయిన్ విషయంలో ఇటు రష్యా, అటూ అమెరికా వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం తప్పదనే పరిస్థితి నెలకొందన్న అంచనాల్లో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఇదే క్రమంలో విదేశీ సంస్థాగత మదుపర్లు తమ ఈక్విటీలను తరలించుకుపోతున్నారు.
నిఫ్టీ-50లో 16 స్టాక్స్ మాత్రమే లాభపడగా.. మిగితా 34 సూచీలు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, ఐచర్ మోటర్స్, హిందాల్కో, బజాజ్ ఫిన్సర్వ్, హీరో మోటో, ఒఎన్జిసి సూచీలు అధికంగా 1.7 శాతం వరకు పెరిగిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు బిపిసిఎల్, టిసిఎస్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్బిఐ లైఫ్ సూచీలు 4 శాతం వరకు అధికంగా నష్టపోయిన వాటిలో టాప్లో ఉన్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ ఏకంగా 56,395 కనిష్టాన్ని తాకింది. బిఎస్ఇ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.7-1.6 శాతం చొప్పున నష్టపోయాయి.