Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు నెలల్లో 72 శాతం ఆవిరి
- ఇన్వెస్టర్లు లబోదిబో
- ఇంకా పడిపోవచ్చు : నిపుణులు
హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)గా వచ్చిన పేటియం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ఇన్వెస్టర్లకు తీవ్ర కన్నీళ్లను మిగిల్చుతోంది. ఈ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఎంతో అట్టహాసంగా మార్కెట్లోకి రావడంతో.. ఇన్వెస్టర్లు ఎన్నో ఆశలతో షేర్లను కొనుగోలు చేశారు. కాగా.. లిస్టింగ్ సమయం నుంచి ఇప్పటి వరకు నేల చూపులు చూస్తునే ఉంది. గతేడాది నవంబర్ 18న రూ.2150 వద్ద లిస్టింగ్ అయినా పేటియం షేర్లు కుప్పకూలుతూ.. గురువారం ముగింపు నాటికి రూ.594కు పతనమయ్యాయి. నాలుగు మాసాల్లో ఈ సూచీ మొత్తంగా 72 శాతం మేర విలువ కోల్పోయింది. ఒక్కో షేర్‌పై మదుపరి రూ.1550 మేర నష్టపోయారు. ఎన్నో ఆశలతో ఈక్విటీలను కొనుగోలు చేసిన మదుపర్లు ఇప్పుడు లబోదిబో మంటున్నారు.
అప్పుడే హెచ్చరికలు..
పేటియం ఐపిఒ కాలంలోనూ పలు బ్రోకరేజీ సంస్థలు ఇన్వెస్టర్లను హెచ్చరించాయి. ఈ సంస్థ విలువ అసహజంగా ఉందని.. ఇందులో పెట్టుబడులు శ్రేయస్కరం కాదని సూచించాయి. అయినప్పటికీ ఎన్నో ఆశలతో లక్షలాది మంది పేటియం షేర్లను కొనుగోలు చేశారు. ఇటీవల ఆ సంస్థలో నెలకొన్న డేటా లీక్ అంశాలు, పేటియం బోర్డు నుంచి తాము వైదొలుగుతున్నట్లు సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ ప్రకటించడంతో పేటియంకు మరిన్ని ప్రతికూలతలు పెరిగాయి. దీంతో ఆ కంపెనీ షేర్ మరింత పడిపోవడానికి కారణమయ్యాయి. నవంబర్ 18న పేటియం విలువ రూ.1.39 లక్షల కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం ఇది రూ.40వేల కోట్ల దిగువన.. రూ.38.65 వేల కోట్లకు పడిపోయింది.
మరింత దిగజారొచ్చు..
పేటియం షేర్ల టార్గెట్ ధరను మరింత తగ్గిస్తున్నట్లు మెక్వారీ కేపిటల్ సెక్యూరిటీస్ ఇండియా విశ్లేషకులు సురేష్ గణపతి తెలిపారు. ఈ షేర్ రూ.700కు పెరుగొచ్చని ఇది వరకు ఆయన అంచనా వేయగా.. తాజాగా కోతకు గురి కానుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఈ షేర్ విలువ రూ.450కి తగ్గొచ్చన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పిన్‌టెక్ కంపెనీల విలువ తగ్గుతుందన్నారు.