Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పన్ను ఆదా కోసం నిబంధనల ఉల్లంఘనలు
- ఐటి శాఖ దాడుల్లో కీలక డాక్యుమెంట్లు
- ఏడు శాతం పడిపోయిన షేర్లు
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటో కార్ప్ దాదాపు రూ.1000 కోట్ల బోగస్ ఖర్చుల లెక్కలను చూపినట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. వీటికి సంబంధించిన పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. పన్ను ఆదా కోసం హీరో మోటోకార్ప్, ఆ కంపెనీ ఎండి పవన్ ముంజల్ పలు నిబంధనలను ఉల్లంఘించినట్లు వెల్లడయ్యింది. ఢిల్లీ శివార్లలో రూ.100 కోట్ల నగదు చెల్లించిన ఫామ్‌హౌస్ ఒప్పందంపై కూడా ఐటి శాఖ విచారణ చేపట్టింది. ఈ అంశాలు బయటికి రావడంతో మంగళవారం బిఎస్ఇలో హీరో మోటో కార్ప్ షేర్లు 7.08 శాతం లేదా రూ.168.25 పతనమై రూ.2,208కి దిగజారింది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని పలు ప్రదేశాలలో మార్చి 23 నుంచి మార్చి 26 వరకు హీరో మోటోకార్ప్, సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్‌పై ఆదాయపు శాఖ సోదాలను నిర్వహించింది. ఏక కాలంలో కంపెనీ ప్రమోటర్లు, కార్యాలయాలు, నివాసాలు తదితర 40 కంటే ఎక్కువ ప్రాంతాల్లో అధికారులు విచారణలు చేశారు. సోదాల్లో భాగంగా సంస్థ కార్యకలాపాలకు సంబంధించి హార్డ్ కాపీ డాక్యుమెంట్లు, డిజిటల్ డేటా రూపంలో పెద్ద సంఖ్యలో నేరారోపణలకు సాక్షాలను ఐటి శాఖ స్వాధీనం చేసుకుంది. ఈ దాడుల్లో హీరో మోటోకార్ప్ సంస్థ సుమారు రూ. 1000 కోట్లకు పైగా బోగస్ ఖర్చులను చూపిందని వెల్లడయ్యింది. ఇదే సమయంలో వాంగ్మూలాల నమోదు, పంచనామాలు జరిగాయి. ఐటి చట్టంలోని సెక్షన్ 269 ఎస్ఎస్ను పవన్ ముంజల్ ఉల్లఘించారని ఐటి వర్గాలు తెలిపాయి. 40 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న హీరో మోటో గత 20 ఏళ్లలో 10 కోట్ల వాహనాలను విక్రయించింది.