Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్దిపేటలో ప్లాంట్ ఏర్పాటు
హైదరాబాద్ : శీతల పానియాల బహుళజాతి కంపెనీ కోకాకోలా సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్‌లో రూ.600 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందని పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. రెండో దశలో మరో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని కనబర్చిందన్నారు. ఈ భారీ పానియాల ప్లాంటు నిర్మించడంతో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ స్కిలింగ్ తదితర నాలుగు విభాగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు హిందూస్థాన్ కోకకోల బేవరేజెస్ (హెచ్‌సిసిబి) సంస్థ గురువారం హైదరాబాద్‌లో ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టాలంటూ ఆ కంపెనీని మంత్రి కెటిఆర్ కోరారు. నూతన పరిశ్రమ కోసం ఇక్కడ 48.53 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందన్నారు. తిమ్మాపూర్‌లో ఏర్పాటు చేయబోయే కొత్త పరిశ్రమ ద్వారా 10 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కంపెనీ మహిళలకు 50 శాతానికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందన్నారు. స్థానికంగా దొరికే వనరులు వాడుకోవాలని కోకాకోలా ప్రతినిధులను మంత్రి కోరారు. జగిత్యాలలో ఉన్న మామిడి పండ్లు, నల్గొండ దగ్గరున్న నిమ్మ ఉత్పత్తులు ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపాందించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలు సమస్యగా మారాయన్నారు. పర్యావరణహితమైన వాటిని వినియోగించాలని సంస్థను కోరుతున్నామని చెప్పారు. ప్యాకేజింగ్ రంగంలోనూ హైదరాబాద్‌లో విస్తత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలకు తెలంగాణ కేంద్రంగా ఉందన్నారు.