Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హరారె : ఈస్టర్ ప్రార్ధనల కోసం చర్చికి వెళ్ళాలనుకున్న వారు ఏకంగా మృత్యు ఒడికి చేరుకున్న దారుణం జింబాబ్వేలో చోటు చేసుకుంది. ప్రయాణికులతో వున్న బస్సు రోడ్డుపై నుండి అదుపు తప్పి గోతిలో పడడంతో 35మంది మరణించారు. 71మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. స్థానిక జియన్ క్రిస్టియన్ చర్చి సభ్యులను తీసుకుని ఈస్టర్ ప్రార్ధనా సమావేశానికి వెళుతుండగా గురువారం రాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసు ప్రతినిధి అసిస్టెంట్ కమిషనర్ పాల్ నయతి తెలిపారు. బస్సు ప్రయాణికులతో కిక్కిరిసి పోయినట్లు తెలుస్తోందని ఆయన చెప్పారు. జింబాబ్వే బస్సుల్లో సగటున 60 నుండి 75మంది ప్రయాణించవచ్చు. రాత్రి సమయాల్లో అంతమంది అధిక ప్రయాణికులతో వెళ్ళడం సరికాదని అన్నారు. పబ్లిక్ హాలిడేస్ సమయంలో ఇలా రోడ్డు ప్రమాదాలు జరగడం జింబాబ్వేలో సర్వ సాధారణం. రహదారులు కూడా పెద్ద పెద్ద గోతులతో నిండి వుండడం ప్రమాదాలకు తావిస్తోంది.