Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదో రోజూ మార్కెట్ల నేల చూపులు
- సెన్సెక్స్ మరో 700 పాయింట్ల పతనం
- 17వేల దిగువన నిఫ్టీ
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు కొనసాగుతున్నాయి. వరుసగా ఐదో సెషన్లోనూ సూచీలు నేల చూపులు చూశాయి. ఈ సమయంలో దాదాపు రూ.8 లక్షల కోట్ల పైగా సంపద తుడుచుకుపెట్టుకుపోయింది. బలహీన అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయంగా అధిక ధరలు, సన్నగిల్లిన మదుపర్ల విశ్వాసం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం సెన్సెక్స్ 703 పాయింట్లు లేదా 1.23 శాతం కోల్పోయి 56,463కు పడిపోయింది. ఉదయం నుంచి అద్యంతం ఊగిసలాటలో కొనసాగిన మార్కెట్లు చివరి అరగంటలో తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురైయ్యాయి. ఐదు సెషన్లలో ఈ సూచీ ఏకంగా 2,984.03 పాయింట్లు లేదా 5.01 శాతం క్షీణించింది. ఈ కాలంలో బిఎస్ఇ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.8,08,067.6 కోట్ల పతనమై రూ.2,66,02,728 కోట్లకు తగ్గింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 215 పాయింట్లు కోల్పోయి 16,958 వద్ద ముగిసంది. అంతర్జాతీయ భౌగోళిక ఆందోళన అంశాలతో విదేశీ మదుపర్లు తమ ఈక్విటీలను తరలించుకుపోతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా అధిక ద్రవ్యోల్బణం, అమెరికా వడ్డీ రేట్ల పెంపు, చైనాలో కరోనా కేసులు పెరగడం, ఉక్రెయిన్- రష్యా యుద్ధ భయాలు, చమురు ధరల పెరుగుదల, ఎఫ్ఐఐలు తరలిపోవడం తదితర అంశాలు మదుపర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు.