Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని దేశాలు సమన్వయంతో పని చేయాలి
- అమెరికా పర్యటనలో మంత్రి సీతారామన్
వాషింగ్టన్ : క్రిప్టో కరెన్సీలు అన్ని దేశాలకు అతిపెద్ద ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ వర్చ్యువల్ కరెన్సీలతో మనీలాండరింగ్, ఉగ్రవాదులకు నిధులు చేకూర్చడానికి ఉపయోగపడుతాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) సమావేశాల్లో పాల్గొనడానికి మంత్రి వాషింగ్టన్ వెళ్లారు. తొలి రోజు పర్యటనలో భాగంగా ఇక్కడ ఐఎంఎఫ్ ఏర్పాటు చేసిన ''మనీ ఎట్ ఎ క్రాస్‌రోడ్'' సెమినార్లో సీతారామన మాట్లాడుతూ క్రిప్టోలతో అన్ని దేశాలకు ముప్పు పొంచి ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి సాంకేతికతతో కూడిన నియంత్రణ అవసరమన్నారు. ఇది ఏ ఒక్క దేశమో చేయడం అసాధ్యమన్నారు. ఐఎంఎఫ్ సమన్వయంతో అన్ని దేశాలు క్రిప్టోకరెన్సీలపై నియంత్రణ చేపట్టాలని కోరారు. డిజిటల్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు భారత్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి వివరించారు. కరోనా సంక్షోభ కాలంలో భారత సాంకేతిక వినియోగం పెరిగిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ రేటు 64 శాతంగా ఉంటే.. భారత్‌లో 85 శాతంగా ఉందన్నారు. ఈ పర్యటనలో ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, జి20 ప్రతినిధులతో పలు అంశాలపై సంప్రదింపులు జరపనున్నారు. శ్రీలంక, ఇండోనేషియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఏప్రిల్ 27న తిరిగి భారత్‌కు రానున్నారు.