Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యా-ఉక్రెయిన్ ఆందోళనల ప్రభావం
- ఐఎంఎఫ్ అంచనా
వాషింగ్టన్: ప్రస్తుత ఏడాదిలో ప్రపంచ వృద్థి రేటు 3.6 శాతానికే పరిమితం కానుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజాగా అంచనా వేసింది. ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఆందోళనలు ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. ఈ క్రమంలోనే జనవరిలో వేసిన వృద్థి అంచనాలకు 0.8 శాతం కోత పెట్టినట్టు తాజా 'ఐఎంఎఫ్ వాల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్' రిపోర్ట్‌లో పేర్కొంది. ఆ వివరాలు.. ఉక్రెయిన్ సంక్షోభం అనేక రెట్లుగా ఉన్నప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకునే దశలోనే ఉంది. అయినప్పటికీ కరోనా సంక్షోభం నుంచి ఇప్పటికీ పూర్తిగా రికవరీ కాలేదు. జనవరిలో వేసిన అంచనాలతో పోల్చితే కొంత ఒత్తిడిలోకి జారింది. ఉక్రెయిన్ స్థూల జీడీపీ ఏకంగా రెండంకెల పతనంలో ఉంది. రష్యా ఆర్థిక వ్యవస్థ కూడా ఒత్తిడిలోనే ఉంది. రష్యా-ఉక్రెయిన్ల యుద్ధం కారణంగా అధిక ఇంధన ధరలు, ఆహారోత్పత్తుల ధరలతో జీడీపీపై ఒత్తిడి నెలకొంది. ప్రపంచ దేశాల్లోనూ అనేక రకాల కమోడిటీ ధరలు పెరిగిపోయాయి. ''ప్రస్తుత ఏడాదిలో యూరోపియన్ దేశాల వృద్థి రేటు 1.1 శాతం తగ్గి 2.8 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాత్రం సరైన క్రమంలోనే ఉంది.. 2022లో 3.7 శాతం వృద్థిని నమోదు చేసే అవకాశాలున్నాయి. 2023లో 2.3 శాతం పెరుగొచ్చు. చైనా జీడీపీ 4.4 శాతం వృద్థిని కనబర్చనుంది. ఇంతక్రితం అంచనా కంటే ఇది 0.4 శాతం తక్కువ. 2023లో తిరిగి 5.1 శాతం పెరుగొచ్చు.'' అని ఐఎంఎఫ్ రిపోర్ట్ పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. సరైనా విధాన నిర్ణయాల వల్లనే అడ్డంకులను ఎదుర్కొని మెరుగైన వృద్థిని కనబర్చడానికి వీలుందని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ జినుహా పేర్కొన్నారు.
భారత వృద్థి 8.2 శాతం..!
ప్రస్తుత ఏడాది భారత జిడిపి వద్ధి రేటు అంచనాల్ని ఐఎంఎఫ్ తగ్గించింది. 2022లో దేశ జిడిపి 8.2 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. గతంలో 9 శాతంగా అంచనా వేసింది. 2023లో భారత్ వద్ధి రేటు 6.9 శాతంగా ఉండొచ్చని తెలిపింది.