Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీల్ విలువ రూ.3.3 లక్షల కోట్లు
వాషింగ్టన్ : ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ కంపెనీ టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలన్‌మస్క్ అనుకున్న విధంగానే మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా వెబ్సైట్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నారు. మస్క్ ఆఫర్ చేసిన ఒక్కో షేర్‌కు 54.20 డాలర్ల చొప్పున.. 44 బిలియన్ల డాలర్ల (దాదాపు రూ.3.30 లక్షల కోట్లు) ఒప్పందాన్ని ట్విట్టర్ బోర్డు సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సోషల్ మీడియా దిగ్గజ స్వాధీనానికి ఎలన్ నేరుగా వాటాదారులతో సంప్రదింపులు చేసి బోర్డు సభ్యులను ఒప్పించారు. వాక్ స్వాతంత్య్రాన్ని బలోపేతం చేయడానికే ట్విట్టర్‌ను టేకోవర్ చేయాలని భావించినట్లు ఎలన్‌మస్క్ చెప్పారు. సంస్థను అప్పగించడానికి ఆరు మాసాల సమయం పడుతుందని ఆ సంస్థ చైర్మెన్ బ్రెట్ టేలర్, సీఈఓ పరాగ్ అగర్వాల్ వెల్లడించారు.
అనిశ్చితిలో భవితవ్యం : సీఈఓ
ట్విట్టర్ స్వాధీన ప్రకటన అనంతరం ఆ సంస్థ సీఈఓ పరాగ్ అగర్వాల్ సిబ్బందితో మాట్లాడుతూ ట్విట్టర్ ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుందన్నారు. సంస్థ భవితవ్వంపై అనిశ్చితి నెలకొనవచ్చన్నారు. ప్రస్తుత కీలక పరిస్థితుల్లో సిబ్బంది ఉద్వాసనలు ఉండబోవని హామీ ఇచ్చారు. ట్విట్వర్ ఒప్పందం నిర్ణయం కావడంతో సిబ్బందితో జరిగిన సమావేశానికి చైర్మన్ బ్రెట్ టేలర్, సీఈఓ పరాగ్ అగర్వాల్‌లతోపాటు కొత్త యజమాని ఎలన్‌మస్క్, మాజీ సీఈఓ జాక్ డోర్సీ హాజరు కావాల్సి ఉంది. కానీ ఎలన్ మస్క్, జాక్ డోర్సీ గైర్హాజరయ్యారు. ట్విట్టర్ స్వాధీనానికి ఎలన్‌మస్క్ ప్రయత్నిస్తున్నప్పటి నుంచి ఆ సోషల్ మీడియా సంస్థ ఉద్యోగుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఉద్యోగులైతే ట్విట్టర్లోనే తమ నిరసన వ్యక్తం చేయడం విశేషం.
పరాగ్ కొనసాగేనా..!
ప్రస్తుతం ట్విట్టర్ సీఈఓ గా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ కొనసాగుతున్నారు. ఎలన్ సొంతం చేసుకోవడంతో ఇక ఆయన భవిష్యత్‌పై ప్రశ్నర్థకం నెలకొంది. ప్రస్తుత ట్విట్టర్ యాజమాన్యం పట్ల విశ్వాసం లేదని ఇంతకుముందు ఎలన్‌మస్క్ పదేపదే చెప్పడమే ఇందుకు నిదర్శనం.