Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం స్టాక్ మార్కెట్లకు రుచించలేదు. ఆర్బీఐ చర్యతో ముఖ్యంగా దేశంలో ధరల మంటలు నిజమేనని స్పష్టం కావడం మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఈ పరిణామాలతో బుధవారం ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సెన్సెక్స్, నిఫ్టీలు 2 శాతం మేర నష్టపోయాయి. బీఎస్ఈ సెనెక్స్ 1306 పాయింట్లు లేదా 2.29 శాతం కోల్పోయి 55,669కి పతనమయ్యింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 391.50 పాయింట్లు లేదా 2.29 శాతం నష్టంతో 16,677.60 వద్ద ముగిసింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6.27 లక్షల కోట్లు ఆవిరై రూ.2,59,60,852 కోట్లకు పరిమితమయింది. సెన్సెక్స్-30లో పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్ సూచీలు మాత్రమే 2.75 శాతం వరకు రాణించగలిగాయి. మిగితా 27 స్టాక్స్ నేల చూపులు చూశాయి. మిడ్ క్యాప్ 2.63 శాతం, స్మాల్ క్యాప్ సూచీలు 2.11 శాతం చొప్పున నష్టపోయాయి. స్థూలంగా 2,548 స్టాక్స్ పడిపోగా.. 826 స్టాక్స్ సానుకూలంగా.. 101 సూచీలు యథాతథంగా నమోదయ్యాయి. కన్స్యూమర్ డ్యూరెబుల్స్ రంగా అత్యధికంగా 3.88 శాతం పతనమయ్యింది. రియాల్టీ, వైద్య, టెలికం రంగాలు 3.01 శాతం వరకు నష్టపోయాయి.