Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలన్ మస్క్ వెనక్కి తగ్గినా సన్నద్దమే
- ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్
వాషింగ్టన్ : ఎలన్ మస్క్‌తో ఒప్పందం నిలిచిపోయినా తాము నిలబడతామని ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ పేర్కొన్నారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసే ప్రణాళికను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టు టెస్లా అధినేత ఎలన్ మస్క్ చేసిన ప్రకటనపై పరాగ్ స్పందించారు. ఈ ఒప్పందం తప్పకుండా పూర్తి అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ తాము ఊహించిన పరిణామాలకు భిన్నంగా ఎదైనా జరిగినా సన్నద్దంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒప్పందం మధ్యలోనే ఆగినా తాము అన్నిటికీ సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. సోషల్ మీడియా రంగం ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. ఒప్పందాన్ని అడ్డుపెట్టుకుని కీలక నిర్ణయాలు చేయకుండా ఉండలేమన్నారు. సంస్థ పటిష్టం కోసం సంస్థలోని ఇతర అధికారులు కూడా క్రియాశీలకంగా పని చేస్తారన్నారు. ట్విట్టర్‌ను రూ.3.2 లక్షల కోట్లతో కొనుగోలు చేయడానికి మస్క్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అనుహ్యాంగా ఈ ప్రణాళికను తాత్కాలికంగా నిలిపివేసుకుంటున్నానని ప్రకటించారు. ట్విటర్లో స్పామ్, నకిలీ ఖాతాల సంఖ్య కచ్చితంగా ఎంత ఉందన్న విషయాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం వినియోగదారుల్లో నకిలీ ఖాతాల సంఖ్య నిజంగానే అయిదు శాతం కన్నా తక్కువే ఉందని దృవీకరించే వివరాలు అందేవరకూ ట్విటర్ డీల్‌ను తాత్కాలికంగా ఆపుతున్నామన్నారు. కాగా.. ఒప్పందం నుంచి బయటపడటానికి మస్క్ నకిలీ ఖాతాల సాకును ఎంచుకుని ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ట్విట్టర్ స్వాధీనం కోసం 44 బిలియన్ డాలర్లు (రూ.3.2 లక్షల కోట్లు) వెచ్చించే బదులు పరిహారం కింద గరిష్టంగా 1 బిలియన్ డాలర్లు (రూ.7500 కోట్లు) కట్టి మస్క్ తప్పించుకునే యోచనలో ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.