Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుప్పకూలిన దలాల్ స్ట్రీట్
- సెన్సెక్స్ 1000 పాయింట్లు ఫట్
- రూ.3.2 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబయి : దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న అధిక ధరలు దలాల్ స్ట్రీట్‌ను కుదేలు చేశాయి. హెచ్చు ద్రవ్యోల్బణానికి తోడు వడ్డీ రేట్ల పెరుగుదల, రూపాయి పతనం, ఎఫ్ఐఐలు తరలిపోవడం తదితర అంశాలు వారాంతం సెషన్లో స్టాక్ మార్కెట్లను బెంబేలెత్తించాయి. ఒక్క పూటలోనే మదుపర్ల సంపద రూ.3.2 లక్షల కోట్లు ఆవిరయ్యేలా చేశాయి. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 1,017 పాయింట్లు లేదా 1.8 శాతం పతనమై 54,303కు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 284 పాయింట్లు క్షీణించి 16,193కు పరిమితమయ్యింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్క శాతం చొప్పున నష్టపోయాయి. ఐటీ, లోహ, ఎనర్జీ రంగాలు అధిక ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. నిఫ్టీలోని 15 రంగాలు నష్టపోయాయి. ఐటీ, ఫినాన్సీయల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు వరుసగా 2.17 శాతం, 2.24 శాతం, 2.08 శాతం చొప్పున తగ్గాయి. ఇన్వెస్టర్లు రూ.3.11 లక్షల కోట్లు కోల్పోయారు. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,51,84,358.86 కోట్లకు పడిపోయింది. బీఎస్ఈలో 1,309 షేరు ప్రతికూలతను ఎదుర్కోగా.. 1,999 స్టాక్స్ పడిపోయాయి. సెన్సెక్స్-30లో కొటాక్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా సూచీలు అధికంగా నష్టపోయిన వాటిలో టాప్‌లో ఉన్నాయి.
ప్రతికూలాంశాలు..
అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటును మరోసారి పెంచడం, వృద్థి రేటు తగ్గొచ్చన్న అంచనాలు మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ధరల పెరుగుదల భయంతో అమెరికా మార్కెట్లు నష్టపోగా, ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్ల పెంపు విషయంలో దూకుడుగా ఉండటం మదుపర్లను ఆందోళనకు గురి చేసింది. పదేళ్ల తర్వాత వచ్చే నెలలో 25 బేసిక్ పాయింట్లు కీలక వడ్డీరేట్లు పెంచుతామని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) తెలిపింది. చైనాలో బిజినెస్ హబ్ షాంఘై మళ్లీ లాక్డౌన్లోకి వెళ్లడం బలహీన సంకేతాలిచ్చింది. దేశంలో కరోనా కేసులు పెరగడం, అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ పేలవంగా చోటు చేసుకోవడం, విదేశీ సంస్థాగత మదుపర్లు ఈక్విటీలను తరలించుకుపోవడం, అధిక చమురు ధరలు తదితర అంశాలు మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి.