Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో రూ.24 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు ఎలెస్ట్ కంపెనీ ముందుకొచ్చింది. బెంగుళూరులో జరిగిన కార్యక్రమంలో ఆ కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో ఈ పెట్టుబడులు పెడుతున్నట్టు ఎలెస్ట్ కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ చైర్మెన్ రాజేష్ మెహతా మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. బెంగుళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎలెస్ట్ కంపెనీ ఈ పెట్టుబడితో తెలంగాణలో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్, ల్యాప్‌టాప్‌లు వంటి డిస్ప్లేలను తయారు చేస్తుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో తెలంగాణలో పెడుతున్న పెట్టుబడి దేశానికే గర్వకారణమన్నారు.భారతదేశ సెమీకండక్టర్ మిషన్ ప్రకటన తర్వాత రాష్ట్రంలోకి ఫ్యాబ్ రంగంలో పెట్టుబడులు తీసుకువచ్చేందుకు నిరంతరం కషి చేస్తున్నామనీ, ఈరోజు తమ కషి ఫలించి ఎలెస్ట్ కంపెనీ పెట్టుబడి ప్రకటన చేసిందన్నారు. ఈ పెట్టుబడి తర్వాత ఫ్యాబ్ రంగంలో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దీనివల్ల రాష్ట్రంలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి, ఎలెస్ట్ సీఈఓ శ్యామ్ రఘుపతి తదితరులు పాల్గొన్నారు.