Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 22,765 డాలర్లకు పతనం
న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీలు కుప్పకూలుతున్నాయి. ముఖ్యంగా బిట్ కాయిన్ విలువ భారీగా పతనమవుతున్నది. తమ ఖాతాదారుల ఖాతాల నుంచి నగదు ఉపసంహరణలు, బదిలీలను నిలిపివేస్తున్నట్టు క్రిప్టో లెండింగ్ సంస్థ సెల్సియస్ నెట్వర్క్ ప్రకటించటంతో మదుపర్లు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో క్రిప్టోల విలువలు పడిపోయాయి. అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలు, త్వరలో యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచుతుందన్న సంకేతాలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల తదితర అంశాలు క్రిప్టో ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఈ పరిణామాలతో మంగళవారం సెషన్లో బిట్ కాయిన్ విలువ 10 శాతం పతనమై 22,765 డాలర్లకు పడిపోయింది. సాయంత్రం నాలుగు గంటలకు 22,507 డాలర్లకు క్షీణించింది. గతేడాది నవంబర్‌లో బిట్ కాయిన్ 69వేల డాలర్ల ఆల్‌టైం రికార్డు పలికింది. నాటి నుంచి ఇప్పటి వరకు బిట్ కాయిన్ విలువ 66 శాతం పతనమయ్యింది. ముఖ్యంగా గడిచిన 12 వారాలుగా బిట్ కాయిన్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నది. గత ఏడు రోజుల్లో 24 శాతానికి పైగా విలువను కోల్పోయింది. క్రిప్టోల మార్కెట్ క్యాపిటలైజేషన్లో బిట్ కాయిన్ 45.29 శాతంగా ఉంది. ఎథేర్ సైతం 9 శాతం నష్టపోయి 1200 డాలర్ల చేరువలో పడిపోయింది. గతేడాది జనవరి నుంచి గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్ల డాలర్ల దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి.