Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సాంసంగ్ ఇండియా యువతీయువకులకు అద్భుతమైన అవకాశం ఇస్తోంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి వాటికి పరిష్కారం చెప్తే సాంసంగ్ నుంచి రూ.1 కోటి వరకు బహుమతి గెలుచుకోవచ్చు. అంతేకాదు... ఐఐటీ ఢిల్లీ మెంటార్షిప్ కూడా పొందొచ్చు. యువతను కేంద్రీకృతంగా తీసుకొని సాల్వ్ ఫర్ టుమారో పేరుతో విద్య, ఆవిష్కరణల పోటీని ప్రారంభించింది. ఈ కాంపిటీషన్లో 16 ఏళ్ల నుంచి 22 ఏళ్ల వయస్సు వారు పాల్గొనొచ్చు. సమాజంలోని ప్రజలు జీవితాలను మార్చగల వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని కోరుతోంది. భారతదేశం కోసం ఐక్యరాజ్య సమితి సూచించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా విద్య, పర్యావరణం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం లాంటి రంగాల్లో సమస్యలకి పరిష్కారాలను సూచించాల్సి ఉంటుంది.
ఈ యాన్యువల్ ప్రోగ్రామ్ ముగిసిన తర్వాత ముగ్గురు జాతీయ విజేతల్ని ప్రకటిస్తుంది సాంసంగ్. వారికి రూ.1 కోటి బహుమతి లభిస్తుంది. దీంతో పాటు తమ ఐడియాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు ఐఐటీ ఢిల్లీకి చెందిన నిపుణుల మార్గదర్శకత్వం ఆరు నెలల పాటు లభిస్తుంది. ఐఐటీ ఢిల్లీలోని ఇంక్యుబేషన్ సెంటర్‌కి యాక్సెస్ పొందుతారు. ఈ ఆరు నెలల్లో వారు తమ ఐడియాలపై పనిచేస్తారు. ప్రోటోటైప్‌ను వినియోగదారుల స్థాయికి తీసుకెళ్తారు. గెలుపొందినవారి స్కూళ్లు, కాలేజీలకు 85 అంగుళాల సాంసంగ్ ఫ్లిప్ ఇంటరాక్టీవ్ డిజిటల్ బోర్డ్ కూడా ఇవ్వనుంది సాంసంగ్. ఐఐటీ ఢిల్లీలో బూట్-క్యాంప్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్, డిజైన్ థింకింగ్, ఎస్టీఈఎం, ఇన్నోవేషన్, లీడర్షిప్ వంటి ఆన్లైన్ కోర్సుల కోసం రూ.100,000 విలువైన ఓచర్లు కూడా లభిస్తాయి. టాప్ 10 టీమ్స్‌కి సాంసంగ్ ఇండియా కార్యాలయాలు, ఆర్&డీ కేంద్రాలు, బెంగళూరులోని శామ్సంగ్ ఒపెరా హౌస్‌లను సందర్శించే అవకాశం లభిస్తుంది.
ఆసక్తిగల యువతీయువకులు, విద్యార్థులు 2022 జూలై 31 సాయంత్రం 5 గంటల్లోగా samsung.com వెబ్సైట్లో అప్లై చేయాలి. వచ్చిన దరఖాస్తుల నుంచి 50 టీమ్స్‌ని ఎంపిక చేస్తారు. వ్యక్తిగతంగా లేదా ఒక టీమ్‌లో ముగ్గురు కలిపి కాంపిటీషన్లో పాల్గొనొచ్చు. ఈ కాంపిటీషన్లో 50 బృందాలకు ఇండస్ట్రీ నిపుణులు, ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ (FITT) ఎక్స్పర్ట్స్, ఐఐటీ ఢిల్లీ నిపుణుల నుంచి మెంటార్షిప్ లభిస్తుంది.