Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటాడిన సంక్షోభ భయాలు
- సెన్సెక్స్ 1046 పాయింట్లు ఫట్
ముంబయి : అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఎప్పటి నుంచో సంకేతాలు ఇస్తున్న విధంగానే వడ్డీ రేట్లను పెంచేసింది. 1994 తర్వాత ఎప్పుడూ లేని విధంగా 75 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పరిణామానికి తోడు అమెరికాలో ఆర్థిక సంక్షోభం పెరుగుతుందన్న విశ్లేషణలు మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో గురువారం భారత మార్కెట్లు అమ్మ కాల ఒత్తిడితో కుప్పకూలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఓ దశలో ఏకంగా 1,646 పాయింట్లు కోల్పోయింది. తుదకు 1,046 పాయింట్ల నష్టంతో 51,496కు దిగజారింది. దీంతో ఒక్క పూటలోనే మదుపర్లు రూ.5 లక్షల కోట్ల మేర విలువ కోల్పోయారు. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 332 పాయింట్లు కోల్పోయి 15,361 వద్ద ముగిసింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 2.87 శాతం చొప్పున క్షీణించాయి. నిఫ్టీలో లోహ సూచీ అత్యధికంగా 5 శాతం పతనమయ్యింది. రియాల్టీ, ఆటో, బ్యాంకింగ్, ఐటి రంగాల సూచీలు 2 శాతం చొప్పున నష్టపోయాయి.
ఐదు సెషన్లలో రూ.16 లక్షల కోట్లు ఫట్
ఈ సెషన్లలో సెన్సెక్స్ ఏకంగా 3,824.49 పాయింట్లు లేదా 6.91 శాతం పతనమయ్యింది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలు, దేశీయంగా ప్రతి కూల అంశాలు మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి. గడిచిన ఐదు సెషన్లలో మదుపర్ల సంపద ఏకంగా రూ.15.74 లక్షల కోట్లు కరిగి పోయింది. దీంతో బీఎస్ఈ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.2,39,20,631 కోట్లకు తగ్గింది.
ప్రతికూలాంశాలు..
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ 1994 తర్వాత తొలిసారి వడ్డీ రేటును 75 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. మున్ముందు మరింత పెంపు తప్పదనే సంకేతాలను కూడా ఇచ్చింది. గ్లోబల్ మార్కెట్లు ప్రతికూలతలో ట్రేడింగ్ అవుతున్నాయి. జూన్ నెలలో ఇప్పటివరకు భారత మార్కెట్ల నుంచి ఏకంగా రూ.24,949 కోట్ల ఎఫ్ఐఐలను ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే ఎఫ్‌పీఐలు, ఎఫ్ఐఐలు రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అమెరికా ఆర్థిక మాంద్యాన్ని చవిచూడడం ఖాయమనే విశ్లేషణలు ప్రతికూలతలు పెంచాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత బలహీనపడుతోంది. ఈ అంశాలు ముఖ్యంగా మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి.