Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఉదయ్ ఓమ్నీ హాస్పిటల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయ్ ఓమ్నీ హాస్పిటల్ డైరెక్టర్, జాయింట్ రీప్లేస్మెంట్, స్పోర్ట్స్ ఇంజురీస్ చీఫ్ ఉదయ్ ప్రకాష్ నేతృత్వంలో ఈ వేడుకలు జరిగాయి. యోగా ప్రయోజనాలను గురించి అవగాహన కల్పించే క్రమంలో పలువురు సీనియర్ డాక్టర్లు సైతం ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ఉదయ్ ప్రకాష్‌తో పాటుగా సీనియర్ డాక్టర్లు, సిబ్బంది ఓ గంటకు పైగా యోగాసనాలు వేశారు. యోగా ప్రయోజనాలను గురించి డాక్టర్ ఉదయ్ ప్రకాష్ తన సిబ్బందికి వెల్లడించడంతో పాటుగా తమ సిబ్బందికి మొక్కలు, యోగా మ్యాట్లను పంపిణీ చేసి యోగా ఆచరించాల్సిందిగా కోరారు.
ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ‘యోగా ఫర్ హ్యుమానిటీ’తో నేపథ్యంతో నిర్వహిస్తున్నారు. మహమ్మారి కారణంగా శారీరక, మానసిక, భావోద్వేగ ఒత్తిడి ఎదుర్కొంటున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ నేపథ్యం ఎంచుకున్నారు.
డాక్టర్ ఉదయ్ ప్రకాష్ మాట్లాడుతూ ‘‘ఆరోగ్యపరంగా ఫిట్‌గా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా యోగాను స్వీకరించడం పెరిగింది. కేవలం కొవ్వు కరిగించడం కోసం మాత్రమే యోగా ఆచరించడం కాదు, శరీరాకృతి మెరుగుపరుచుకోవడానికి, శ్వాస మీద ధ్యాస కోసం, ధ్యానం కోసం కూడా ఉపయోగపడుతుంది. శారీరక ఆరోగ్యం మెరుగుపరచడంతో పాటుగా మానసిక ప్రశాంతతనూ యోగా అందిస్తుంది. భారతదేశంలో పుట్టిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రక్రియ యోగా’’ అని అన్నారు.