Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాలర్‌తో రూ.78.39కి పతనం
న్యూఢిల్లీ : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ రోజు రోజుకు వెలవెలపోతూ.. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయి పతనాన్ని చవి చూస్తోంది. భారత స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలు, ఎఫ్ఐఐలు తరలిపోవడం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, విదేశీ చెల్లింపులు తదితర పరిణామాలు రూపాయిని అగాథంలో పడేస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా మరో 31 పైసలు పతనమై 78.39కి దిగజారింది. రూపాయి చరిత్రలోనే ఇది అతి కనిష్ట స్థాయి. ఇంతక్రితం సెషన్లో ఇది 78.08 వద్ద ముగిసింది. అధిక చమురు ధరల పెరుగుదలకు భారత స్టాక్ మార్కెట్లు వరుస పతనం, ఎఫ్ఐఐలు తరలిపోవడం, డాలర్‌కు డిమాండ్ పెరగడం తదితర అంశాలు రూపాయిని బలహీనపర్చుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు వరుసగా తొమ్మిది నెలల నుంచి తమ ఈక్విటీలను తరలించుకుపోతున్నారు. జూన్‌లో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు రూ.38,500 కోట్లను వెనక్కి తీసుకున్నారు. రూపాయి విలువ తగ్గడం ద్వారా దిగుమతి వస్తువులు మరింత ప్రియం కానున్నాయి. ముఖ్యంగా చమురు చెల్లింపులు భారం కానున్నాయి. మరోవైపు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు ప్రియం కానున్నాయి. దిగుమతుల బిల్లులు పెరగడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారీగా చేసిన అప్పులపై అధిక వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. దీన్ని పూడ్చడానికి ప్రభుత్వాలు ప్రజలపై అధిక పన్ను భారాలు మోపనున్నాయి. దీంతో అంతిమంగా భారతీయులపై తీవ్ర ఆర్థిక భారం పడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.