Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరెన్సీ రికార్డ్ పతనంతో ప్రజలపై భారాలు
- ఎలక్ట్రానిక్, వాహన ఉత్పత్తులు మరింత ప్రియం
- విదేశీ విద్యా, ప్రయాణం కష్టమే
- ఇక ద్రవ్యోల్బణ తాండవమే
- పెరగనున్న వడ్డీ రేట్లు
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి రికార్డ్ పతనం భారతీయులందరిపై ప్రత్యక్ష్యంగా.. పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపనుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 80కి చేరువలో పడిపోయింది. గత నెల రోజుల్లో 78 స్థాయి నుంచి 3 శాతం మేర పతనమయ్యింది. భవిష్యత్తు రోజుల్లో ఇది మరింత క్షీణించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత ఆర్థిక విధానాలతో దేశంలో ఇప్పటికే అధిక ధరలు బెంబేలెత్తిస్తున్న తరుణంలో కరెన్సీ క్షీణత ద్రవ్యోల్బణానికి మరింత ఆజ్యం పోయనుంది. ప్రజల ఆదాయం పడిపోనుంది. వస్తువులకు డిమాండ్ తగ్గనుంది. అంతిమంగా ఇది తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారి తీయనుంది. గురువారం డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 7 పైసలు క్షీణించి 79.99కి పడిపోయింది. దేశీయ కరెన్సీ వరుస పతనం వల్ల ముఖ్యంగా దిగుమతి ఉత్పత్తులు భారంగా మారనున్నాయి. విదేశీ విద్యా, అంతర్జాతీయ ప్రయాణాలు, వాహనాలు, ఎలక్టాన్రిక్ ఉపకరణాలు, చమురు, బంగారం, వంటనూనెలు, పప్పు దినుసులు తదితరాల ధరలు మరింత పెరుగుతాయి. విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థులు విద్యా, వీసాలు, వసతి కోసం భారీగా చెల్లించాల్సి వస్తుంది. ఇటీవల కేంద్రం భారీగా బొగ్గు దిగుమతులకు అనుమతించింది. ఈ రంగానికి అధికంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఆ బొగ్గుతో ఉత్పత్తి చేసిన విద్యుత్ భారం కానుంది. భారత మొత్తం చమురు వినియోగంలో 85 శాతం దిగుమతుల నుంచి సమకూర్చుకున్నదే కావడం గమనార్హం. చమురు దిగుమతులపై భారీగా చెల్లింపులు జరుగుతున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయి. ఈ పరిణామాలు భారత్‌లో అధిక ధరలకు కారణాలు కానున్నాయి. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం మరింత ఎగిసిపడనుంది. హెచ్చు ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచాల్సి ఉంటుంది. ఇప్పటికే రెండు సార్లు రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు పెంచడంతో అన్ని రకాల రుణాలు ప్రియమమయ్యాయి. రూపాయి దెబ్బతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే ఆర్బిఐ ఎంపిసి సమీక్షాల్లో వడ్డీ రేట్లు పెంచడానికి మెండుగా అవకాశాలున్నాయి. అదే జరిగితే అన్ని రకాల రుణాలు భారం కానున్నాయి. ప్రస్తుత వాయిదా చెల్లింపుల (ఇఎంఐ) విలువ పెరగనుంది. అధిక ధరలు, హెచ్చు వడ్డీ రేట్లు ప్రజల కొనుగోలు శక్తిని హరించనున్నాయి. దీంతో వస్తు డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడనుంది. అతి త్వరలోనే డాలర్‌తో రూపాయి విలువ 82కి పడిపోవచ్చని ఆర్థిక నిపుణులు, పరిశోధన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. జూన్ నెలలో వాణిజ్య ఖాతా లోటు రికార్డుస్థాయిలో 26 బిలియన్ డాలర్లకు పెరిగింది. భారత్‌లోకి వచ్చి.. పోయే విదేశీ కరెన్సీ ఆధారంగా లెక్కించే కరెంట్ ఖాతా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ లోటును నమోదు చేయవచ్చని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. కరెంట్ ఖాతా లోటు ఈ ఏడాది 3 శాతానికి పెరుగుతుందన్న అంచనాలున్నాయి. డాలర్ విలువ పెరగడం.. రూపాయి అమాంతం బక్కచిక్కడంతో ప్రపంచ దేశాల నుంచి భారత్ తీసుకున్న అప్పులపై అధిక వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతులు, అప్పులు, వడ్డీలకు చేసే విదేశీ చెల్లింపులతో భారత మారకం నిల్వలు వేగంగా కరిగిపోనున్నాయి. ఈ పరిణామాలకు తోడు హెచ్చు ద్రవ్యోల్బణం రూపాయి ని, దేశాన్ని సంక్షోభంలోకి నెట్టవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.